Share News

సమస్యలతో సహజీవనం

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:11 AM

స్థానిక వెనుకబడిన తరగతుల ప్రభుత్వ బాలుర వసతి గృహం అధ్వానంగా వుంది. తగిన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రక్షిత తాగునీటి సదుపాయం కూడా లేదు. మరుగుదొడ్లు, స్నానపు గదులు కంపు కొడుతున్నాయి. అవరణలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.

సమస్యలతో సహజీవనం
మరుగుదొడ్డిలో పనిచేయని ఫ్లష్‌ ట్యాంకు, అపరిశుభ్రంగా వున్న లెట్రిన్‌ బేసిన్‌

అధ్వానంగా కశింకోట బీసీ బాలుర హాస్టల్‌

కొరవడిన రక్షిత తాగునీరు

60 మంది విద్యార్థులకు రెండు మరుగుదొడ్లు, మూడు స్నానపు గదులు!

భరించలేని దుర్వాసనతో విద్యార్థుల పాట్లు

రాత్రిపూట ఆకతాయిలకు అడ్డాగా మారిన హాస్టల్‌ ప్రాంగణం

ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారం

పట్టించుకోని సంక్షేమ శాఖ అధికారులు

కశింకోట, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక వెనుకబడిన తరగతుల ప్రభుత్వ బాలుర వసతి గృహం అధ్వానంగా వుంది. తగిన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రక్షిత తాగునీటి సదుపాయం కూడా లేదు. మరుగుదొడ్లు, స్నానపు గదులు కంపు కొడుతున్నాయి. అవరణలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.

కశింకోటలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో ప్రస్తుతం సుమారు 60 మంది విద్యార్థులు వుంటున్నారు. గత ఏడాది జూన్‌లో పాఠశాలలు తెరిచినప్పుడు మొత్తం 80 మంది విద్యార్థులు చేరారు. ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో ఒక్కరొక్కరుగా సుమారు 20 మంది హాస్టల్‌ను ఖాళీ చేశారు. వసతి గృహంలో తాగునీటి సదుపాయం లేదు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నుంచి ట్యాపుల ద్వారా వచ్చే నీటిని గిన్నెల్లోకి పట్టుకొని, వేడిచేసుకొని తాగుతున్నారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకును ఎన్నాళ్లకోసారి శుభ్రం చేస్తారో తెలియదని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్‌కు ప్రహరీ గోడ లేకపోవవడంతో రాత్రిపూట ఆకతాయిలు లోపలికి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పందులు, కుక్కలు యథేచ్ఛగా చొరబడుతున్నాయి. 60 మంది విద్యార్థులకు నాలుగు మరుగుదొడ్లకుగాను రెండే వినియోగంలో వున్నాయి. అవి కూడా తీవ్ర దుర్వాసన వస్తున్నాయి. స్నానపు గదులు ఆరింటికిగాను మూడే బాగున్నాయి. వాటికి కూడా తలుపులు సరిగా లేవు. చేతులు శుభ్రంచేసుకొనేచోట వాష్‌బేసిన్‌ డ్రైన్‌ పైపులు లేకపోవడంతో గచ్చు మొత్తం తడిసిపోయి నాచు పేరుకుపోయింది. దీనివల్ల విద్యారులు జారిపడుతున్నారు. హాస్టల్‌ ఆవరణలో చెత్త పేరుకుపోయింది. బోరు మోటారు విద్యుత్‌ వైర్లు బయటకు కనిపిస్తూ ప్రమాదకరంగా మారాయి. విద్యార్థులకు వేడి నీటి సదుపాయం కోసం హాస్టల్‌ భవనంపై ఏర్పాటు చేసిన సోలార్‌ వాటర్‌ హీటర్‌ నిరుపయోగంగా మారింది. భవనంపైన పిట్టగోడ లేకపోవడంతో విద్యార్థులకు ప్రమాదం పొంచివుంది.

వసతిగృహంలో నెలకొన్న సమస్యలపై ఇన్‌చార్జి వార్డెన్‌ నారాయణరావును వివరణ కోరగా.. వార్డెన్ల సంఘం ద్వారా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పనులు చేయిస్తామని తెలిపారు.

Updated Date - Feb 07 , 2026 | 01:12 AM