Share News

ఉక్కులో బిక్కుబిక్కు

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:49 AM

స్టీల్‌ప్లాంటులో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉక్కులో బిక్కుబిక్కు

వరుస ప్రమాదాలతో ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన

నాలుగు రోజుల వ్యవధిలో ఎస్‌ఎంఎస్‌-1లో మరో ప్రమాదం

లాడిల్‌ నుంచి బయటకు వచ్చిన ద్రవపు ఉక్కు

ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్‌ఎంఎస్‌-1 విభాగంలో సోమవారం జరిగిన దుర్ఘటనను మరువకముందే గురువారం తెల్లవారుజామున, రాత్రి మళ్లీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఎస్‌ఎంఎస్‌ విభాగంలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా లాడిల్‌ త్రూ (పెద్ద బకెట్‌ నుంచి లిక్విడ్‌ స్టీల్‌ బయటకు పోవడం) వల్ల సంభవిస్తున్నాయి.

ఎస్‌ఎంఎస్‌-1 విభాగంలో సోమవారం సాయంత్రం పెద్ద ప్రమాదం జరగడంతో విధులకు హాజరయ్యేందుకు విభాగం ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు వెనకడుగు వేశారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తామని భరోసా ఇస్తే డ్యూటీకి హాజరవుతామని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎస్‌ఎంఎస్‌ విభాగంలో ఉద్యోగులు, కార్మికులతో ప్లాంట్‌ డైరెక్టర్‌లు, ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రమాదాలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం నుంచి ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. అయితే విభాగంలో ఇంకా ఉత్పత్తి పునఃప్రారంభం కాకముందే మరోసారి గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 5.20 గంటల సమయంలో కంటిన్యూస్‌ కాస్టింగ్‌ సెక్షన్‌కు పంపడానికి 28వ నంబరు కలిగిన లాడిల్‌ను సిద్ధం చేస్తుండగా పెద్ద రంధ్రం ఏర్పడడంతో అందులో ఉన్న సుమారు 80 టన్నుల వరకు ద్రవపు ఉక్కు నేలపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఉద్యోగులు బయటకు వచ్చేశారు. ప్రమాదం సీ షిఫ్ట్‌లో జరగ్గా, ఏ షిఫ్ట్‌నకు వచ్చే ఉద్యోగులు లోపలకు వెళ్లడానికి భయపడిపోయారు. కొంత సమయం తరువాత ఒక్కొక్కరిగా విభాగంలోకి వెళ్లారు.

వరుస ప్రమాదాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గుర్తింపు యూనియన్‌ డిమాండ్‌

ప్లాంటులో వరుస ప్రమాదాలు, కార్మికుల మరణాలు, భద్రతా నిబంధనల అమలులో వైఫల్యాలపై రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌ (ఆర్‌ఎల్‌సీ)-సెంట్రల్‌కు గుర్తింపు యూనియన్‌ అధ్యక్షుడు కేఎస్‌ఎన్‌ రావు ఫిర్యాదు చేశారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకూ సుమారు 25 వరకు ప్రమాదాలు చోటుచేసుకోగా 30 మంది వరకు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు మృతిచెందారని, మరో 200 మంది గాయపడ్డారని వివరించారు. సమగ్ర విచారణ చేపట్టకపోవడం, విచారణ నివేదికలు బహిర్గతం చేయకపోవడం, భద్రత లోపాల సవరణకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా ఉద్యోగులను తగ్గించడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై పని భారం పెరిగి ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. యూనియన్‌ ప్రతినిధులు, ఉద్యోగులతో కలిసి కచ్చితంగా తనిఖీలు నిర్వహించాలని, ప్రమాదాలపై స్వతంత్ర కమిటీతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.


స్టీల్‌ప్లాంట్‌లో గత ఏడాది కాలంగా జరిగిన ప్రమాదాలు

గాజువాక, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటులో గత ఏడాదికాలంలో అనేక ప్రమాదాలు జరిగాయి. గత ఏడాది మార్చి 14న ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో బలిరెడ్డి పెంటయ్య అనే ఉద్యోగిపై లిక్విడ్‌ స్టీల్‌ ఒలిగిపోవడంతో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2025 ఏప్రిల్‌ ఒకటో తేదీన మృతిచెందారు. 2025 జూన్‌ 17న సీడీసీపీ-3 విభాగంలో ఎలక్ర్టికల్‌ ప్యానల్‌ను తొలగించే క్రమంలో ఎత్తు నుంచి పడిపోయి ఉద్యోగి కె.వెంకటరమణ మృతిచెందారు. ఆగస్టు 11న కంటైనర్‌ పడిపోవడంతో సురేష్‌సింగ్‌ అనే కాంట్రాక్టు కార్మికుడు మృతిచెందారు. ఆగస్టు 20న ఎస్‌ఎంఎస్‌-2లోని హాట్‌మెటల్‌ ఏరియాలో పనిచేస్తున్న సీనియర్‌ టెక్నీషియన్‌ కె.పైడికొండ ప్రమాదవశాత్తూ పైనుంచి కిందపడిపోయి మృతిచెందారు. సెప్టెంబరు 6న కోకోఓవెన్‌ విభాగంలో డస్ట్‌ ప్రివెన్షన్‌ టాన్స్‌పోర్టు సిస్టమ్‌ స్టేషన్‌ వద్ద ప్రమాదవశాత్తూ పడిపోయి కాంట్రాక్టు కార్మికుడు సీహెచ్‌ అప్పలనాయుడు మృతిచెందారు. అదే నెల 23వ తేదీన బ్లూమ్‌ ఫర్నేస్‌, బూమ్‌ మధ్య నలిగిపోయి డి.ముత్యాలు అనే కాంట్రాక్టు కార్మికుడు మృతిచెందారు. నవంబరు 11న గ్యాస్‌ క్లీనింగ్‌ ప్లాంటు-2లో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా లోకో ఢీకొనడంతో కాంట్రాక్టర్‌ కేవీ భాస్కర్‌ కురుప్‌ మృతిచెందాడు. నవంబరు 25న డి.గోపాలకృష్ణ అనే కార్మికుడు సీడబ్ల్యూసీ వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. ఇవే కాకుండా ఆయా విభాగాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు గాయాలపాలయ్యారు.

Updated Date - Jun 12 , 2026 | 01:49 AM