నిబద్ధతతో పనిచేస్తే అక్షరాస్యత పెంపు
ABN , Publish Date - May 26 , 2026 | 11:09 PM
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ‘అక్షరాంధ్ర- అక్షరాస్యత’ కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో జరిగింది.
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, మే 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ‘అక్షరాంధ్ర- అక్షరాస్యత’ కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్షరాంధ్ర రెండో దశలో భాగంగా 1,01,086 మంది నిరక్షరాస్యులను యాప్‌లో నమోదు, రిజిస్ర్టేషన్ ప్రక్రియలను పక్షం రోజుల్లో పూర్తిచేయాలని చెప్పారు. గతంలో జరిగిన కొన్ని క్లాసులను పరిశీలించినప్పుడు వలంటీర్ల నియామకం ఆశించిన స్థాయిలో లేదని, తగిన సామర్థ్యం వున్న వారిని వలంటీర్లుగా నియమించాలని సూచించారు. అభ్యాసకులు 100 గంటల తరగతులు పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించిన హాజరును అక్షరాంధ్ర యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. రెండో దశలో ఏయే అంశాల్లో వెనుకపడ్డారో గుర్తించి, మూడవ దశలో వాటిని అధిగమించి మంచి ఫలితాలు చూపించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నిరక్షరాస్యులకు చదువు చెప్పే వలంటీర్లలో పురుషులు తక్కువగా వున్నారని, ఈసారి వారి భాగస్వామ్యాన్ని పెంచాలని కలెక్టర్ సూచించారు. అక్షరాస్యతలో జాతీయ సగటు కంటే అనకాపల్లి జిల్లా తక్కువగా వుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని జిల్లాలో అక్షరాస్యతను పెంచడానికి కృషి చేయాలని ఆదేశించారు. గత ఏడాది లక్ష మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దగా, ఈ ఏడాది కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగాలని వయోజన విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, డ్వామా పీడీ నిర్మలాదేవి, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, డీపీఓ సందీప్, మెప్మా పీడీ రమేశ్ రామన్, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ బీవీ సత్యనారాయణ, వయోజన విద్యా శాఖ ఏడీ డి.చిన్నికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.