Share News

మద్యం దుకాణాల ఇష్టారాజ్యం

ABN , Publish Date - May 30 , 2026 | 12:41 AM

నగరంలో మద్యం దుకాణాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నారు.

మద్యం దుకాణాల ఇష్టారాజ్యం

బీర్‌లపై బాదుడు

ఎంఆర్‌పీ కంటే రూ.పది అధికంగా వసూలు

పట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో మద్యం దుకాణాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. వ్యాపారుల దందాపై మందుబాబులు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లా పరిధిలో 160 మద్యం దుకాణాలు, 96 బార్‌లు ఉన్నాయి. వీటితోపాటు కొన్ని స్టార్‌ హోటళ్లు, క్లబ్‌లు, ఏపీ టూరిజానికి చెందిన మద్యం దుకాణాలు ఐదు ఉన్నాయి. ఎక్కడైనా సరే ప్రభుత్వం నిర్దేశించిన ధరకే మద్యం విక్రయించాలి. అలా జరిగేలా జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. అయితే దుకాణాల యజమానులు బీర్‌లపై రూ.పది అదనంగా వసూలు తీసుకుంటున్నారు. ఓ బ్రాండ్‌ ఎంఆర్‌పీ రూ.260 ఉంటే...రూ.270 వసూలు చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. మందుబాబులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం బీచ్‌రోడ్డులోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఎదురుగా ఉన్న వైన్‌మార్ట్‌లో రూ.పది అధికంగా వసూలు చేస్తున్నారంటూ అధికారులకు ఫోన్‌ చేసినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీనిపై జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారి ప్రసాద్‌ను వివరణ కోరగా ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని, ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపించి విచారణ జరిపిస్తున్నామన్నారు. ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలుచేసినట్టు తేలితే చర్యలు తప్పవవి స్పష్టంచేశారు.

Updated Date - May 30 , 2026 | 12:41 AM