12వ స్థానానికి పరిమితం!
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:56 AM
ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని విజయవాడలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.
ఇదీ పనితీరులో విశాఖ జిల్లా స్థానం
63.45 శాతం మందికే తాగునీటి కనెక్షన్లు
రూ.417.47 కోట్లతో 170 కి.మీ. రహదారుల నిర్మాణం
నిధుల లభ్యత 34.5ు...వినియోగం 20.3 శాతం
పెట్టుబడులకు ఒప్పందాలు 86...అమలు అయ్యింది 26 మాత్రమే
22-ఏ కేసులు భారీగా పెండింగ్
కలెక్టర్ల సదస్సులో సీఎం
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలని విజయవాడలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. పెట్టుబడిదారుల సదస్సులో చేసుకున్న ఒప్పందాలు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లాల వారీగా సమర్పించిన నివేదికలను విశ్లేషించి ఆయన పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో జిల్లాల వారీగా అఽభివృద్ధి, పథకాల అమలు ఇండికేటర్లు, వచ్చిన స్కోర్లను చూసుకుంటే ‘విశాఖపట్నం’ 162 ఇండికేటర్లతో 84 స్కోరుతో 12వ స్థానంలో నిలిచింది. జిల్లాకు 1,31,935 ఇళ్లు మంజూరు కాగా వాటిలో 72 శాతం పనులు ప్రారంభించారని, ఇంకా 2,316 ఇళ్ల నిర్మాణం ప్రారంభమే కాలేదని గుర్తించారు. ఈ ఏడాది డిసెంబరు, వచ్చే ఏడాది మార్చి చివరికి అన్ని పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
- విశాఖపట్నంలో 6,24,195 గృహాలు ఉండగా వాటిలో 3,96,030 గృహాలకే తాగునీటి కనెక్షన్లు ఉన్నాయని, ఇంకా 2,28,165 గృహాలకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.
- జీవీఎంసీ పరిధిలో కొత్తగా రూ.417.47 కోట్లతో 170 కి.మీ. రహదారులు వేస్తున్నామని అధికారులు నివేదించారు.
- జిల్లాలో వివిధ పనులు, పథకాలకు నిధులు 34.5 శాతం మాత్రమే అందుబాటులో ఉండగా వాటిలో 20.3 శాతం వినియోగించుకున్నారు.
- కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ జిల్లాకు సంబంధించి 86 అవగాహన ఒప్పందాలను సదస్సులో కుదుర్చుకోగా, వాటిలో ఇప్పటివరకు 28 మాత్రం గ్రౌండింగ్ అయ్యాయి. అలాగే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా 53 ప్రాజెక్టులు మంజూరు కాగా వాటిలో 27 గ్రౌండింగ్ జరిగాయి. మిగిలిన వాటిని కూడా త్వరితంగా చేయాలని సీఎం ఆదేశించారు.
- విశాఖ జిల్లాలో వివిధ పరిశ్రమలకు కేటాయించడానికి 3,981.43 ఎకరాలు అవసరం కాగా ఇప్పటివరకూ ఏపీఐఐసీ 1,121.28 ఎకరాలు మాత్రమే సేకరించింది.
- జిల్లాలో 22-ఏ జాబితా నుంచి తొలగించాల్సిన కేసులు 5,674, రెవెన్యూ రికార్డులో నమోదు చేయాల్సిన మ్యుటేషన్ల కేసులు 3,391 కలిపి మొత్తం రెవెన్యూ అధికారుల వద్ద 9,065 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి వాటిలో ఒక్కటి కూడా క్లియర్ చేయలేదని సీఎంకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. వీటిపై కూడా దృష్టిసారించాలని సీఎం సూచించారు.
- విశాఖలో అక్టోబరు 7వ తేదీన ఏఐ-డేటా సెంటర్లు, ఐటీ-ఫిన్‌టెక్, సెమీ కండక్టర్లు, జీసీసీలు, ఫార్మా, మెడ్‌టెక్ రంగాలపై సదస్సు నిర్వహించాలని సూచించారు.