రోడ్లలా.. చెరువులా...!
ABN , Publish Date - Aug 02 , 2026 | 10:47 PM
అల్లూరి జిల్లాలోని జీకేవీధి, హుకుంపేట మండలాల్లో ప్రధాన రహదారులు పూర్తిగా పాడయ్యాయి. రోడ్లు చేపల చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. అడుగుకో గుంత ఏర్పడ్డాయి. రోడ్ల నిర్వహణను ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలు గాలికొదిలేశాయి.
అధ్వానంగా మన్యంలో రహదారులు
చేపల చెరువులా తయారైన సీలేరు-పాలగెడ్డ రోడ్డు
హుకుంపేట రహదారిలో గుంతలే..గుంతలు
కన్నెత్తి చూడని ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖల అధికారులు
సీలేరు/హుకుంపేట, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సీలేరు నుంచి పాలగెడ్డ వరకూ ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారి గోతులతో చేపల చెరువులా తయారైంది. ప్రతి రోజూ ఈ రహదారిలో వాహనాలు ప్రమాదానికి గురై వాహనదారులు ఆసుపత్రి పాలైపోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఈ రహదారి పూర్తిగా పాడైపోయి పెద్ద పెద్ద గోతులమయంగా మారింది. ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని పదేళ్ల క్రితం నుంచి పోరాటాలు చేస్తున్నా ఏ అధికారి గాని, ప్రజాప్రతినిధులకు గాని చీమకుట్టినట్టు లేదు. స్వర్గీయ బీజేపీ నాయకుడు లోకుల గాంధీ ధారకొండలో ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా ఇంతవరకూ రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు. ప్రస్తుతం సీలేరు-పాలగెడ్డ రహదారి చేపల చెరువులా మారడంతో వాహనాలు ప్రతి రోజూ ప్రమాదాలకు గురవుతునే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా వెళ్లినా కూడా ప్రమాదాలు తప్పడం లేదని వాహనదార్లు వాపోతున్నారు. రోజుకు 15 ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎక్కడ గోతులు ఉన్నాయో, ఎక్కడ నీరు ఉందో తెలియక ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అత్యవసరంలో రోగిని తరలించాలన్నా.. అంబులెన్సు రావాలన్నా డ్రైవర్లు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ అంబులెన్సు కూడా ఈ గోతుల్లోనే కూరుకుపోయే అవకాశం ఉంది. కార్లు అయితే కింద ఇంజన్‌కు తగిలి వాహనాలు పాడైపోతున్నాయి. రహదారి సక్రమంగా లేకపోవడంతో విశాఖపట్నం-హైదరాబాద్, విశాఖపట్నం-భద్రాచలం, భద్రాచలం-కోరాపుట్, భద్రాచలం-జైపూర్, పాడేరు-భద్రాచలం, బస్సులను రద్దు చేశారు. ఇప్పటికైనా అఽధికారులు, కూటమి నాయకులు స్పందించి సీలేరు-పాలగెడ్డ రహదారి నిర్మాణ పనులను చేపట్టాలని ఈప్రాంతీయులు కోరుతున్నారు.
శిథిలమైన హుకుంపేట, కామయ్యపేట రోడ్లు
హుకుంపేట మండలంలోని హుకుంపేట, కామయ్యపేట రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రహదారి నిర్వహణను ఆర్‌అండ్‌బీ అధికారులు, కామయ్యపేట రహదారిని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అవి పూర్తిగా శిథిలమయ్యాయి. హుకుంపేట ఆర్‌ఎంబీ ప్రభుత్వ హైస్కూల్ నుంచి కొంతెలి జంక్షన్ వరకు గుంతలు ఏర్పడి ఏర్పడ్డాయి. హుకుంపేట నుంచి చింతలవీధి వరకు రోడ్డు గుంతలు ఉండడంతో వర్షాలు కురిస్తే రోడ్డుపైనే నీరు నిలిచిపోతుండడంతో తడిగిరి, మోట్టుజోరు, తిగలవలస, సోభకోట పంచాయతీల ప్రజలు, ఉద్యోగులు రాకపోకలకు తిప్పలు పడుతున్నారు. చింతవీధి నుంచి కామయ్యపేట వరకు రోడ్డు సైతం అధ్వానంగా తయరైందని వాహన చోదకులు చెబుతున్నారు. ఈ రహదారి నిర్వహణను పంచాయతీరాజ్ అధికారులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా వారు చర్యలు చేపట్టడం లేదు. రోడ్డు దుస్థితిని పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని రాజకీయ పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు వాహన చోదకులు కోరుతున్నారు,