రబీలో ఆరుతడి పంటలే మేలు
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:46 AM
ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే రబీ సీజన్‌లో స్వల్పకాలిక ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు సూచించారు.
- ఏడీఆర్ డాక్టర్ ముకుందరావు
అనకాపల్లి అగ్రికల్చర్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే రబీ సీజన్‌లో స్వల్పకాలిక ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్ ముకుందరావు సూచించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం నిర్వహించిన జిల్లా వ్యవసాయ సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా కురిసినప్పటికీ జిల్లాలో వర్షపాతం లోటు 16 శాతం వరకు ఉందన్నారు. 10 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, 14 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి నాట్లు వేయడానికి సమయం మించిపోయిందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి మాట్లాడుతూ వరి సాధారణ విస్తీర్ణంలో 44 శాతం, మొత్తం పంటల విస్తీర్ణంలో 42 శాతం మాత్రమే సాగులోకి వచ్చిందన్నారు. రాబోయే రబీ సీజన్‌లో ఉలవలు, జోడి మినుము, పెసర మినుము, మొక్కజొన్న, నువ్వులు వంటి ఆరుతడి పంటలు సాగు చేయడం మేలని ఆమె సూచించారు. ఈ పంటలకు సంబంఽధించిన 1,020 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితిని మండలాల వారీగా సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి రాజశేఖర్, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ అప్పలస్వామి, డాక్టర్ వి.గౌరి, డాక్టర్ విశాలాక్షి, డాక్టర్ డి.ఉమామహేశ్వరరావు, డాక్టర్ రవికుమార్, వ్యవసాయ శాఖ సహ సంచాలకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.