లైట్‌హౌస్ ఫెస్టివల్
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:05 AM
భీమిలి తీరంలో గల పురాతన లైట్‌హౌస్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
నేటి నుంచి ప్రారంభం
ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు
విశాఖను లైట్ హౌస్ టూరిజం హబ్‌గా
చేయాలని లక్ష్యం
హడావిడిగా ఏర్పాట్లు
మరమ్మతులు చేయకుండానే రంగుల పూత
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘లైట్‌హౌస్ ఫెస్టివల్స్’ నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ ఈ ఉత్సవాలు గోవా, పూరీల్లో మాత్రమే జరగ్గా, ఈసారి 3.0 పేరుతో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. విశాఖను లైట్‌హౌస్ టూరిజం హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఇక్కడ ఈ ఉత్సవాలను ఏర్పాటుచేశారు. శుక్ర, శనివారాల్లో జరిగే ఈ ఉత్సవాలకు పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తోంది. విశాఖపట్నం పోర్టు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైట్‌హౌస్‌స్, లైట్ షిప్పింగ్స్ శాఖ సంయుక్తంగా పనులు చేపడుతున్నాయి.
నగరంలోని ఆర్కే బీచ్‌రోడ్డులో గల ఎంజీఎం పార్కు మైదానంలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మొదలయ్యే ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్, సహాయ మంత్రి శాంతాను ఠాకూర్, కేంద్ర పర్యాటక శాఖా మంత్రి సురేశ్ గోపి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, పార్లమెంటు సభ్యులు శ్రీభరత్, సీఎం రమేశ్ తదితరులు హాజరవుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జానపద నృత్యాలు, తీరప్రాంత రాష్ట్రాల్లో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు ఆటలు, ఫ్యాషన్ షోలు, హస్తకళలు, నేపథ్య గాయకుల సంగీత ప్రదర్శన ఉంటాయి. తీరప్రాంతాల్లో నివసించే వారంతా ఇందులో భాగస్వాములయ్యేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఐదు లైట్ హౌస్‌లు
సముద్రంలో ప్రయాణించే నౌకలకు దిశానిర్దేశం చేయడానికి లైట్‌హౌస్‌లు ఉపయోగపడతాయి. విశాఖపట్నంలో ఆంగ్లేయుల కాలంలోనే ఆర్కే బీచ్‌లో లైట్ హౌస్ (వుడా పార్కు వెనుక) ఏర్పాటుచేశారు. అదేవిధంగా పోర్టుకు సమీపాన సెయింట్ ఎల్లాయిస్ స్కూల్ సమీపాన మరో లైట్ హౌస్ ఏర్పాటైంది. ఆ తరువాత విశాఖలో తూర్పు నౌకాదళం ఏర్పాటు కావడం, నౌకల రాకపోకలు పెరగడంతో యారాడ వద్ద డాల్ఫిన్‌నోస్‌పై కొత్త లైట్ హౌస్ ఏర్పాటుచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం, గంగవరం పోర్టులకు వచ్చే నౌకలకు ఇదే దిశా నిర్దేశం చేస్తోంది. నిర్వహణ బాధ్యతలు నేవీ చూస్తోంది. రాత్రిపూట పెద్ద దీపం ఇక్కడ వెలుగుతుంటుంది. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ, రాత్రిపూట వచ్చే నౌకలకు ఇక్కడి నుంచి సంకేతాలు అందిస్తుంది. అదేవిధంగా భీమిలిలో ఒకటి, అనకాపల్లి జిల్లా పూడిమడకలో మరో లైట్‌హౌస్ ఉన్నాయి. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైట్‌హౌసెస్ అండ్ లైట్‌షిప్స్ (డీజీఎల్‌ఎల్) పర్యవేక్షిస్తోంది. సెయింట్ ఎల్లాయిస్ స్కూల్ సమీపానున్న లైట్‌హౌస్‌ను వారసత్వ సంపదగా గుర్తించి నిర్వహణ బాధ్యతలను విశాఖపట్నం కంటెయినర్ టెర్మినల్‌కు అప్పగించారు. వుడా పార్కు వెనుకనున్న లైట్‌హౌస్ మూతపడింది. ఆలనాపాలన లేదు. భీమిలిలో లైట్‌హౌస్ పనిచేస్తోంది.
హడావిడి ఏర్పాట్లు
లైట్‌హౌస్ ఉత్సవాలను ఈసారి విశాఖపట్నంలో నిర్వహించాలని చాలా ముందుగానే నిర్ణయించారు. వీటికి విస్తృత ప్రచారంతో పాటు ముందస్తు ఏర్పాట్లు చేయాల్సి ఉండగా అధికారులు ఇప్పుడు హడావిడిగా పనులు ప్రారంభించారు. వుడా పార్కు సమీపానున్న లైట్‌హౌస్‌కు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా, పెచ్చులూడిపోయిన స్తంభంపైనే రంగులు పూస్తున్నారు. ఉత్సవాల కోసం దానిని ముస్తాబు చేస్తున్నట్టుగా ఉందే తప్ప పది కాలాలు చారిత్రక నిర్మాణంగా ఉంచాలనే ఆలోచన ఏ కోశానా లేదు. మరింత ముందుగా ప్రచారం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భీమిలిలో పురాతన లైట్‌హౌస్
భీమునిపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
భీమిలి తీరంలో గల పురాతన లైట్‌హౌస్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 17వ శతాబ్దంలో డచ్ పోర్టు సిటీగా ప్రాధాన్యం పొందిన భీమునిపట్నం ఆ తరువాత బ్రిటీష్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా అభివృద్ధి జరిగింది. ఈ క్రమంలో 1868లో భీమిలి తీరంలో 36 అడుగుల ఎత్తులో బ్రిటీషర్లు లైట్‌హౌస్‌ను నిర్మించారు. అప్పట్లో ఆరు నెలల్లో రూ.10 వేల వ్యయంతో ఈ లైట్‌హౌస్‌ను నిర్మించడం జరిగింది. ఈ దీపపు స్తంభం నిర్మాణంలో వినియోగించిన ఆరు గ్లాసులను బ్రిటన్ నుంచి రప్పించారు. ప్రతి మూడు సెకండ్లకు ఒకసారి వెలుగులు విరజిమ్మేలా దీనిని రూపొందించారు. ఈ వెలుగులు సముద్రంలో 11 మైళ్ల దూరంలో ఉన్న నౌకలకు ఇక్కడ పోర్టు ఉందనే సంకేతాన్ని అందించేవి. కాగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత ప్రభుత్వం ఓపెన్ యాంకరింగ్ పోర్టులను మూసివేస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో భీమిలి పోర్టు మూతపడింది.