Share News

ఆయుష్‌కి ఆయువు

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:26 PM

సంప్రదాయ వైద్యం ఆయుష్‌కి కూటమి ప్రభుత్వం ఆయువుపోసింది. వైసీపీ ప్రభుత్వం మరుగునపడేసిన ఆయుష్‌ వైద్యశాలలకు పునర్జీవం ఇచ్చింది. ఆ శాఖలో వైద్యాధికారి ఖాళీ పోస్టులను భర్తీ చేసింది. వైద్యశాలలకు నూతన భవనాలను మంజూరు చేసింది. పూర్తి స్థాయిలో మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లా కేంద్రం పాడేరుకి ఇంటీగ్రేటెడ్‌ హోమియో ఆస్పత్రిని మంజూరు చేసింది.

ఆయుష్‌కి ఆయువు
తాజంగి పీహెచ్‌సీలోని ఒక గదిలో హోమియోపతి ఆస్పత్రిని నిర్వహిస్తున్న వైద్యులు ఉదయ సందీప్‌

సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యం

ఇచ్చిన కూటమి ప్రభుత్వం

ఆయుర్వేద, హోమియో వైద్యశాలలకు

నూతన భవనాలు మంజూరు

వైద్యాధికారి పోస్టులు భర్తీ

పూర్తి స్థాయిలో మందులు

చింతపల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధవైద్యం, హోమియోపతి వైద్యసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ కరువైంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్నేళ్లుగా ప్రజలు ఆయుర్వేద, హోమియోపతి వైద్యంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయుష్‌ పరిధిలోని వైద్యశాలలను బలోపేతం చేసేందుకు ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.112.08 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ఆయుష్‌ ఆస్పత్రులకు మౌలిక వసతులు, మందులు సమకూర్చనుంది. అలాగే ఈ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, దిగువ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసింది.

జిల్లాలో ఏడు ఆస్పత్రులు

అల్లూరి జిల్లాలో ఏడు ఆయుర్వేద, హోమిపతి ఆస్పత్రులు ఉన్నాయి. కొయ్యూరు మండలం ఆడాకుల, అరకులోయ, డుంబ్రిగుడ, పెదబయలు మండలం గంపరాయిలో ఆయుర్వేద, చింతపల్లి మండలం తాజంగి, పాడేరు, జీకేవీధి మండలం సీలేరులో హోమియోపతి ఆస్పత్రులు ఉన్నాయి. వైద్యులు, మందుల కొరత కారణంగా ఆయుష్‌ ఆస్పత్రుల సేవలు ప్రజలకు దూరమయ్యాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రతీ ఆయుష్‌ ఆస్పత్రికి పూర్తి స్థాయిలో వైద్యులను నియమించింది. ప్రస్తుతం ఆయుర్వేద, హోమియోపతి ఆస్పత్రులకు వైద్యులు అందుబాటులో ఉన్నారు. పూర్తి స్థాయిలో మందులను సమకూర్చింది. ఆయుష్‌ ఆస్పత్రులు శిథిలావస్థలో ఉండడంతో కొన్ని ఆస్పత్రులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.

ఆయుష్‌ ఆస్పత్రులకు నూతన భవనాలు

కూటమి ప్రభుత్వం ఆయుష్‌ ఆస్పత్రులకు నూతన భవనాలను మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 160 ఆస్పత్రులకు నూతన భవనాలు, పాత భవనాల మరమ్మతులకు నిధులను మంజూరు చేసింది. జిల్లాలో గంపరాయి ఆయుర్వేద ఆస్పత్రి, పాడేరు, సీలేరు, తాజంగి హోమియో ఆస్పత్రులకు నూతన భవనాలు నిర్మించేందుకు రూ.30లక్షలు చొప్పున నిధులు మంజూరు చేసింది. అరకు ఆయుర్వేద ఆస్పత్రి ఆధునికీకరణకు రూ.15లక్షలు మంజూరు చేసింది. ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను ఏపీఎంఎస్‌ఐడీసీకి అప్పగించారు. తాజంగిలో నూతన భవనం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

పాడేరులో ఇంటీగ్రేట్‌ హోమియో ఆస్పత్రి

పాడేరుకు కూటమి ప్రభుత్వం ఇంటీగ్రేటెడ్‌ హోమియో ఆస్పత్రిని మంజూరు చేసింది. ప్రస్తుతం ఆస్పత్రి నిర్మాణానికి భూసేకరణ జరుగుతోంది. ఈఆస్పత్రి నిర్మాణం జరిగితే హోమియోపతిలో ప్రత్యేక విభాగాలకు చెందిన వైద్యులను ప్రభుత్వం నియమించనుంది.

ఆయుష్‌ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

డాక్టర్‌ ఉదయ సందీప్‌, హోమియో వైద్యాధికారి, తాజంగి

ఆయుష్‌ వైద్యాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి. హోమియోపతి వైద్యంపై ప్రజలు చైతన్యవంతులు కావాలి. కొంతమంది రోగులు సుదూర ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా మధుమేహం, రక్తపోటు, కీళ్లనొప్పులు, గ్యాస్ట్రిక్‌, మహిళల్లో అధిక రక్తస్రావం బాధపడుతున్న రోగులు చికిత్స పొందుతున్నారు. హోమియోపతి ఆస్పత్రిలో ఉచితంగా అన్ని రకాల వ్యాధులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. మందులు అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Jan 09 , 2026 | 10:26 PM