Share News

పనులు పంచేసుకుందాం

ABN , Publish Date - May 20 , 2026 | 12:25 AM

జీవీఎంసీ ఇంజనీరింగ్‌, అకౌంట్స్‌ విభాగాల్లో కాంట్రాక్టర్ల సంఘం నేత ఒకరు చక్రం తిప్పుతున్నారు.

పనులు పంచేసుకుందాం

ఎవరూ బిడ్‌లు వేయొద్దు

జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘం నేత హుకుం

లాటరీ ద్వారా తానే కేటాయిస్తానంటూ మెసేజ్‌లు

పనులు దక్కించుకున్నవారు మూడు శాతం ఇవ్వాలని షరతు

ఆ మొత్తం అధికారులను మేనేజ్‌ చేసేందుకట

తనను కాదని పనులు దక్కించుకుంటే బిల్లులు మంజూరు కానివ్వబోనని బెదిరింపులు

ఇంజనీరింగ్‌, అకౌంట్స్‌ విభాగాల్లో కొందరి అండ చూసుకుని చెలరేగిపోతున్నారనే విమర్శలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఇంజనీరింగ్‌, అకౌంట్స్‌ విభాగాల్లో కాంట్రాక్టర్ల సంఘం నేత ఒకరు చక్రం తిప్పుతున్నారు. ఆయా విభాగాల అధికారులను గుప్పిట్లో పెట్టుకుని మిగిలిన కాంట్రాక్టర్లపై రుబాబు చేస్తున్నారు. బిడ్‌లు వేయకుండా అడ్డుకోవడంతోపాటు లాటరీ ద్వారా ఆయా పనులను కేటాయిస్తానంటూ వాట్సాప్‌ ద్వారా కాంట్రాక్టర్లకు మెసేజ్‌లు పెడుతున్నారు.

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఏటా రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. రోడ్లు, కాలువలు, భవనాలు, పెయింటింగ్‌ పనులు, గ్రిల్స్‌ ఏర్పాటు, నీటి సరఫరా పైప్‌లైన్‌ల మరమ్మతులు, పంప్‌హౌస్‌ల రిపేర్లు వంటి పనులకు ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలుస్తారు. అర్హులైన కాంట్రాక్టర్లకు టెండర్‌లలో పాల్గొనేందుకు వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా జీవీఎంసీ పరిధిలో నిత్యం పనులు చేసే కాంట్రాక్టర్లు మాత్రమే బిడ్‌ దాఖలు చేస్తుంటారు. ఎవరు ఎక్కువ లెస్‌కు బిడ్‌ వేస్తే వారికి అధికారులు నిబంధనలు ప్రకారం వర్క్‌ ఆర్డర్‌ కాపీని అందజేయాలి. అయితే జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘం నేత ఒకరు ఇంజనీరింగ్‌ విభాగంతోపాటు అకౌంట్స్‌ విభాగంలోని కీలక అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు ఏదైనా పనికి టెండర్‌ పిలిస్తే ఎవరికివారు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో బిడ్‌ దాఖలు చేయకుండా, అందరూ ఏకాభిప్రాయంతో పనులను లాటరీ ద్వారా పంచుకుందామని ప్రతిపాదించారు. ఎవరికి వారు భారీగా లెస్‌కు బిడ్‌లు వేయడం వల్ల కాంట్రాక్టర్లకు లాభాలు తగ్గిపోతున్నాయని, అందువల్ల లాటరీ ద్వారా పనులను పంచుకుందామని చెప్పుకొచ్చారు. ఈ విధంగా మూడు నెలల కిందట బాగా డబ్బులు మిగిలే పనులను లాటరీ ద్వారా తనకు కావలసిన వారికి కట్టబెట్టాలనుకున్నారు. ఈ విషయం తెలిసి కొందరు కాంట్రాక్టర్లు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో అధిక లెస్‌కు బిడ్‌ వేశారు. అయితే వారికి పనులు కేటాయించకుండా ఉండేందుకు బిడ్‌లు తెరవకుండా జాప్యం చేయాలని తనకు సన్నిహితంగా ఉండే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. మరోవైపు బిడ్‌ వేసిన కాంట్రాక్టర్లను పిలిచి పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు అధికారులకు లెటర్‌ రాసి ఇవ్వాలని, లేనిపక్షంలో తనకున్న పలుకుబడితో పనులు చేసినప్పుడు ఇబ్బందిపెట్టడంతోపాటు బిల్లు మంజూరుకాకుండా చేస్తానంటూ బెదిరించారు. దీంతో చాలామంది తమ బిడ్‌లను ఉపసంహరించుకున్నారు. లాటరీ ద్వారా పనులు పొందినవారి నుంచి అసోసియేషన్‌ ఖర్చులు, అధికారులకు మామూళ్ల కోసమంటూ మూడు శాతం చొప్పున సుమారు రూ.60 లక్షలు వసూలు చేసినట్టు ప్రచారం జరిగింది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో కాంట్రాక్టర్లు లాటరీ విధానానికి విముఖత చూపారు. గతంలో వసూలుచేసిన మొత్తంతో విదేశాలకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు మళ్లీ డబ్బుల కోసం లాటరీ విధానాన్ని తిరిగి ప్రారంభిద్దామంటూ కాంట్రాక్టర్లకు మెసేజ్‌లు చేస్తున్నాంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆయన అకౌంట్స్‌ విభాగంలోని కీలక అధికారి సహాయంతో కొందరు కాంట్రాక్టర్లకు అడ్డదారిలో బిల్లులు ఇప్పించడం, తనను విభేదించే వారికి బిల్లులు జారీ కాకుండా నిలుపు చేయించడం చేస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. జీవీఎంసీ కమిషనర్‌ దృష్టిసారించి లాటరీ ద్వారా వర్కులు కేటాయించే విధానానికి అడ్డుకట్ట వేయడం ద్వారా కాంట్రాక్టర్ల సంఘం నేత దందాకు ముకుతాడు వేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

Updated Date - May 20 , 2026 | 12:25 AM