మోదకొండమ్మ ఉత్సవాలను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - May 05 , 2026 | 12:42 AM
ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరిగే మోదకొండమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు.
- సమన్వయ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి
పాడేరు, మే 4 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరిగే మోదకొండమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో అధికారులు, ఉత్సవ, ఆలయ కమిటీల సభ్యులతో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ స్టాళ్ల ఏర్పాటు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, రవాణా సౌకర్యాలు, భోజన వసతి సదుపాయాలు, ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు, అగ్నిమాపక శకటాలు ఏర్పాటు, వైద్య సేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులు తమ ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టణంలో తాగునీటి సమస్యలు ఏర్పడకుండా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని, అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రాకపోకలు సాగించేందుకు వంద వరకు ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు, ఉత్సవ కమిటీతో సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్ టి.నిషాంతి మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించి చేయాల్సిన పనులను ఆయా శాఖల అధికారులు రూపొందించిన ప్రణాళికల ఆధారంగా చేపట్టాలన్నారు. ఎస్‌పీ అమిత్‌బర్దార్ మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందలాది మంది సిబ్బందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామన్నారు. వాహనాల రాకపోలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చక్కని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్సవాలపై రూపొందించిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్‌వో లోకేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి, ఆర్‌టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టూరిజం డైరెక్టర్ కేవీ రమేశ్‌నాయుడు, ట్రైకార్ డైరెక్టర్ కె.కృష్ణారావు, వివిధ శాఖల అధికారులు, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.