మత్తు, నేర రహిత జిల్లాగా తీరిదిద్దుదాం
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:02 PM
అల్లూరి జిల్లాను మత్తు, నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ యంత్రాంగం పనిచేయాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్
నేరస్థులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి
పాడేరురూరల్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లాను మత్తు, నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ యంత్రాంగం పనిచేయాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశించారు. జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పెండింగ్ కేసులు, దర్యాప్తుల పురోగతి, మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలు, శాంతిభద్రతలు, రోడ్డు భద్రత, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్‌బర్దార్ మాట్లాడుతూ మత్తుపదార్థాల సాగు, రవాణ, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్ డిటెక్షన్ కిట్లను సమర్థవంతంగా వినియోగిస్తూ డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా నిఘాను మరింత పటిష్టం చేయాలని సూచించారు. మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, బాలికల రక్షణ, శక్తి యాప్ వినియోగం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధితులకు న్యాయం చేయాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతరం నిఘా కొనసాగించాలని, రాత్రిగస్తీలు, వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని, డ్రంక్‌అండ్ డ్రైవ్, ట్రాఫిక్ అమలు క్రమం తప్పకుండా నిర్వహించాలనానరు. ఈ సమావేశంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఈగల్ బృందం అధికారులు పాల్గొన్నారు.