Share News

జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:40 PM

సంపూర్ణత అభియాన్‌ 2.0లో భాగంగా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
సంపూర్ణత అభియాన్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, నీతిఅయోగ్‌ ప్రతినిధి శ్రేయ, తదితరులు

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ పిలుపు

కలెక్టరేట్‌లో ఘనంగా సంపూర్ణత అభియాన్‌ 2.0 కార్యక్రమం

పాడేరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): సంపూర్ణత అభియాన్‌ 2.0లో భాగంగా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం నీతి అయోగ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళల సృజనాత్మక అకాడమీ చైౖర్మన్‌ వంపూరు గంగులయ్య, నీతి అయోగ్‌ అధికారిణి శ్రేయ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి దిశగా నడిపేందుకు అందరి సహకారం కావాలని, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని, యాక్షన్‌ప్లాన్‌తో పక్కాగా ముందుకు సాగుదామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు పాటుపడాలని, సంపూర్ణత అభియాన్‌ 2.0 కింద జిల్లాస్థాయిలో ప్రణాళికలను రూపొందించామని, ఫలాలను నేరుగా ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడతామన్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, మౌలిక వసతుల కల్పనకు, వైద్య ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టిసారించామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలందించడమే ముఖ్య ఉద్దేశమని వివరించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళల సృజనాత్మక అకాడమీ చైౖర్మన్‌ వంపూరు గంగులయ్య మాట్లాడుతూ లక్ష్యాలను నెరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలని, సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాలని, వాటిపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సీపీవో ప్రసాదరావు నీతి అయోగ్‌ ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు గిరిజన బాలికల సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకోగా, సంపూర్ణత అభియాన్‌ 2.0 కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఐసీడీఎస్‌ పీడీ సీహెచ్‌.ఝాన్సీబాయి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డి.కృష్ణమూర్తి నాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, ప్రకృతి వ్యవసాయం జిల్లా డీపీఎం ఎల్‌.భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:40 PM