విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించుదాం
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:20 AM
సామాజిక అడువుల పెంపకంలో భాగంగా విత్తన బంతులను వినియోగించి పచ్చదనం పెంపునకు కృషి చేద్దామని డివిజనల్ అటవీ అధికారి(డీఎఫ్‌వో) కె.ఉమామహేశ్వరి పిలుపునిచ్చారు.
డీఎఫ్‌వో కె.ఉమామహేశ్వరి
పాడేరు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): సామాజిక అడువుల పెంపకంలో భాగంగా విత్తన బంతులను వినియోగించి పచ్చదనం పెంపునకు కృషి చేద్దామని డివిజనల్ అటవీ అధికారి(డీఎఫ్‌వో) కె.ఉమామహేశ్వరి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో మంగళవారం విత్తన బంతులపై అటవీశాఖ సిబ్బందికి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విత్తన బంతులను వినియోగించడం ద్వారా సులభంగా సామాజిక వనాల అభివృద్ధికి అవకాశఽం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ ఎన్‌జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం నేతృత్వంలో విత్తన బంతుల తయారీని వివరించారు. 70 శాతం ఆవుపేడ, 30 శాతం మట్టి కలిపి దానితో బంతిలా తయారు చేసి అందులో 3 విత్తనాలను పెట్టాలని ఆమె వివరించారు. అలా తయారు చేసిన విత్తన బంతులను వినియోగించడం ద్వారా వనాల అభివృద్ధి, వాతావరణ సమతుల్యతకు దోహదపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర కోట్ల విత్తన బంతులను వినియోగించాలనే అటవీశాఖ లక్ష్యంలో పాడేరు డివిజన్ ముందంజలో ఉండేలా సిబ్బంది కృషి చేయాలని ఆమె సూచించారు. అందుకు గాను డివిజన్ పరిధిలోని 52 అటవీ బీట్‌ల పరిధిలోనూ విత్తన బంతుల తయారీ ప్రక్రియను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ రేంజ్ అధికారులు, బీట్, సెక్షన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.