Share News

నిగ్గు తేలుద్దాం

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:42 AM

జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటై, అక్రమాలకు నిలయంగా మారి మూన్నాళ్లకే మూతపడిన వెలుగు మహిళా మార్టుల్లో నిధుల దుర్వినియోగం, అవినీతి లెక్కలు తేల్చేందుకు అధికారులు సన్నద్ధమైనట్టు తెలిసింది. సుమారు నాలుగేళ్ల క్రితం జిల్లాలో చోడవరం, మాడుగుల, సబ్బవరం, నర్సీపట్నం, ఎస్‌.రాయవరం, మాకవరపాలెం మండలాల్లో వెలుగు మహిళా మార్టులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్టుల నిర్వహణలో ఎవరి స్థాయిలో వారు అవతవకలకు పాల్పడడంతో మాకవరపాలెం మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి.

నిగ్గు తేలుద్దాం
మాడుగులలో మూతపడిన మహిళా మార్టు

మహిళా మార్టుల్లో అక్రమాలపై ఉన్నతాధికారుల ఆరా

లెక్కలు తేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం

ఏపీవోల నుంచి వివరాల సేకరణ

చోడవరం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటై, అక్రమాలకు నిలయంగా మారి మూన్నాళ్లకే మూతపడిన వెలుగు మహిళా మార్టుల్లో నిధుల దుర్వినియోగం, అవినీతి లెక్కలు తేల్చేందుకు అధికారులు సన్నద్ధమైనట్టు తెలిసింది. సుమారు నాలుగేళ్ల క్రితం జిల్లాలో చోడవరం, మాడుగుల, సబ్బవరం, నర్సీపట్నం, ఎస్‌.రాయవరం, మాకవరపాలెం మండలాల్లో వెలుగు మహిళా మార్టులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్టుల నిర్వహణలో ఎవరి స్థాయిలో వారు అవతవకలకు పాల్పడడంతో మాకవరపాలెం మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. మహిళా మార్టుల్లో జరిగిన అక్రమాలపై మాడుగుల ఎమ్మెల్యే బండారు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన అధికారులు, ఆ మండల వెలుగు సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘మహిళా మార్టుల పేరుతో మేసేశారు’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో మూతపడిన ఇతర మార్టులలో జరిగిన అక్రమాలను వెలికితీసి, బాధ్యులైన వారి నుంచి నిధులు రికవరీ చేసేందుకు వెలుగు శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు. వెలుగు ఏపీఎంల ద్వారా మార్టుల వారీగా దేనికి ఎంత ఖర్చు చేసిందీ వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. మాడుగులలో మాదిరిగానే ఇతర మార్టుల్లో అక్రమాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టనున్నట్టు చెబుతున్నారు.

రకరకాలుగా దుర్వినియోగం

ఎవరైనా వ్యాపారం ప్రారంభిస్తే, వ్యాపారానికి తగినట్టుగా సిబ్బందిని నియమించుకోవడం సహజం. అయితే మహిళా మార్టులలో వైసీపీ నేతల సిఫారసులతో అవసరానికి మించి తమకు నచ్చిన వారిని ఉద్యోగులుగా నియమించడంతో, వారికి వేతనాల రూపంలోనే డబ్బులు దుర్వినియోగం జరిగినట్టు డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. మార్టు నిర్వహణకు వెలుగు సీసీతో పాటు, ఒక మేనేజర్‌, ప్రెసిడెంట్‌, సెక్రటరీ, ఇద్దరు బిల్లింగ్‌ సిబ్బంది, నలుగురు సేల్సుమెన్‌, ఒక స్వీపరు, ఒక వాచ్‌మన్‌తో కలిపి మొత్తం 12 మందిని నియమించారు. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనాల రూపంలో చెల్లించారు. ఇక మార్టులకు ఎన్ని సరుకులు వస్తున్నాయి? ఎన్ని సరుకులు విక్రయిస్తున్నారు? స్టాకు ఎంత వుంది? అన్న రోజువారి వివరాలను సక్రమంగా నమోదు చేయలేదు. ఇంకా నిర్వహణపరంగా కూడా అనవసర ఖర్చులు పెట్టడంతో మార్టులకు నష్టాలు వచ్చాయి. ఇక మార్టుల్లో పనిచేస్తున్న స్బిబ్బందిపై అజమాయిషీ లేకపోవడంతో సరుకులు పక్కదారిపట్టాయి.

Updated Date - Aug 08 , 2026 | 12:42 AM