Share News

అన్నీ ఆమోదించేద్దాం

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:35 AM

‘మరో వారం రోజుల్లో మాజీలమైపోతాం. ఇదే చివరి సమావేశం. పెండింగ్‌లో ఉండిపోయిన పైళ్లతోపాటు గతంలో తిరస్కరించినవి, వాయిదా వేసినవి అన్నీ ఈసారి పెట్టేయండి. ఆమోదించేద్దాం.’...ఇదీ జీవీఎంసీ అధికారులకు స్టాండింగ్‌ కమిటీలోని కొందరు పెద్దలు జారీచేసిన మౌఖిక ఆదేశాలు.

అన్నీ ఆమోదించేద్దాం

పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, ప్రతిపాదనలన్నీ పెట్టేయండి

జీవీఎంసీ అధికారులకు స్టాండింగ్‌ కమిటీ పెద్దల మౌఖిక ఆదేశం

13న స్టాండింగ్‌ కమిటీ చివరి సమావేశం

అజెండా తయారీలో అధికారులు నిమగ్నం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘మరో వారం రోజుల్లో మాజీలమైపోతాం. ఇదే చివరి సమావేశం. పెండింగ్‌లో ఉండిపోయిన పైళ్లతోపాటు గతంలో తిరస్కరించినవి, వాయిదా వేసినవి అన్నీ ఈసారి పెట్టేయండి. ఆమోదించేద్దాం.’...ఇదీ జీవీఎంసీ అధికారులకు స్టాండింగ్‌ కమిటీలోని కొందరు పెద్దలు జారీచేసిన మౌఖిక ఆదేశాలు.

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఈనెల 13న నిర్వహించాలని మేయర్‌ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. ఈ మేరకు అజెండా తయారుచేసి కమిటీ సభ్యులందరికీ సమాచారం ఇవ్వాలని కార్యదర్శి బీవీ రమణను ఆదేశించారు. జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం ఈనెల 17తో ముగుస్తున్నందున ఇదే చివరి స్టాండింగ్‌ కమిటీ సమావేశం కానున్నది. ఆ తర్వాత ప్రత్యేక అధికారి పాలన అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో స్టాండింగ్‌ కమిటీ ఆమోదం కోసం అజెండాలో చేర్చలేకపోయిన అంశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, పనుల్లో నాణ్యత లేదని బిల్లుల చెల్లింపునకు తిరస్కరించిన లేదా వాయిదా వేసిన అంశాలను తాజా సమావేశంలో ఆమోదానికి పెట్టాలని కమిటీ పెద్దలు కొందరు అన్ని విభాగాల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు చర్చ జరుగుతోంది. సాధారణంగా రూ.50 లక్షల కంటే తక్కువ విలువ కలిగిన పనులకు ఆమోదం, బిల్లుల చెల్లింపు, లీజులు, వేలం కోసం అనుమతులు, ఉద్యోగుల సర్వీసుకి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు స్టాండింగ్‌ కమిటీకి అధికారం ఉంటుంది. గత ఐదేళ్లలో జరిగిన కొన్ని పనులతోపాటు సదస్సులు, కార్యక్రమాల ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ కోసం అదనపు కార్మికుల నియామకం, అద్దె వావాహలను ఏర్పాటుచేసుకోవడం వంటి అంశాల్లో అవినీతి జరిగిందంటూ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేయడం, కొన్నింటిని వాయిదా వేయడం/తిరస్కరించడం చేశారు. అలాంటి వాటిలో కొన్నింటిని తర్వాత జరిగిన సమావేశాల్లో తిరిగి ఆమోదించినప్పటికీ, మరికొన్ని ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాంటి అంశాలను కూడా ఈనెల 13న జరిగే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆమోదించేయాలని కమిటీలోని కొందరు పెద్దలు నిర్ణయించినట్టు తెలిసింది. స్టాండింగ్‌ కమిటీ అజెండా బయటకు వస్తేనేగానీ ఏఏ అంశాలను చేర్చారనేది తెలిసే అవకాశం లేదు. స్టాండింగ్‌ కమిటీలో ఏదైనా అంశం ఆమోదానికి పర్సంటేజీ తీసుకుంటారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి.

Updated Date - Mar 10 , 2026 | 12:35 AM