సవాళ్లను అధిగమిద్దాం
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:13 AM
విశాఖ స్టీల్‌ప్లాంటును లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా పనిచేయాలని, ప్రతి ఒక్కరూ కర్మాగారాన్ని సొంత సంస్థగా భావించి బాధ్యతతో ముందుకు సాగాలని సీఎండీ ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ప్లాంటును లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు సమష్టిగా కృషిచేద్దాం
ఉద్యోగులకు, కార్మికులకు ఉక్కు సీఎండీ ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ పిలుపు
నెగెటివ్ కామెంట్స్ వద్దు
సానుకూల దృక్పథంతో ముందుకుసాగాలి
ఉక్కుటౌన్‌షిప్, జూలై 31 (ఆంధ్రజ్యోతి):
విశాఖ స్టీల్‌ప్లాంటును లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా పనిచేయాలని, ప్రతి ఒక్కరూ కర్మాగారాన్ని సొంత సంస్థగా భావించి బాధ్యతతో ముందుకు సాగాలని సీఎండీ ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఉక్కులో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సభ శుక్రవారం ఉక్కు క్లబ్ ఎంపీ హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ ప్లాంటులో ఎవరి పనీ చిన్నది కాదన్నారు. ప్రతి ఒక్కరిలో పాజిటివ్ ఫీలింగ్, సాధించాలనే పట్టుదల ఉండాలన్నారు. గెలుపు సాధ్యమనే భావనతో సాగాలని, అప్పుడే విజయం దక్కుతుందన్నారు. అందరం కలిసి బ్రాండ్‌గా మెలగాలని, ఆలోచనలు, భావాలు ఒకే దిశలో ఉండాలని, ప్లాంటుకు పూర్వ వైభవం తీసుకువచ్చి, లాభాల బాటలోకి తేవడమే లక్ష్యంగా సాగాలని పిలుపునిచ్చారు. సంస్థకు ఉద్యోగులు, కార్మికులు బలమని, ఏ విభాగంలో పనిచేస్తున్న వారైనా తనను ఎప్పుడైనా సంప్రతించవచ్చని, సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు.
ప్రస్తుతం ప్లాంటులోని వివిధ విభాగాల్లో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతున్నామన్నారు. నీతి, నిజాయితీతో విధులు నిర్వహించాలన్నారు. ప్లాంటు మనుగడపై ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు (నెగెటివ్ కామెంట్స్) చేయవద్దని హితవు పలికారు. ఇటీవల కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారని, అలా చేయవద్దని, అతి తక్కువ కాలంలోనే ప్లాంటు ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌లు, ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలు, వివిధ అసోసియేషన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.
రిజైన్ వార్తలను కొట్టిపారేసిన సీఎండీ
తాను రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవాలని సీఎండీ స్పష్టం చేశారు. ప్లాంటు సీఎండీగా కొనసాగుతానని, అందరి సహకారంతో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.