Share News

నిమ్మ రైతు ఖుషీ

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:09 AM

నిమ్మ తోటను సాగుచేసే రైతులకు చాలా కాలం తరువాత మంచిరోజులు వచ్చాయి. మార్కెట్‌లో నిమ్మకాయలకు గిరాకీ పెరిగి, ఊహించని ధర లభిస్తుండడంతో రైతులు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కిలో రూ.120 నుంచి రూ.150కి కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు.

నిమ్మ రైతు ఖుషీ
తిమ్మాపురంలో నిమ్మతోట

ఊహించని ధరలతో ఉబ్బితబ్బిబ్బు

తోటల వద్దనే కిలో రూ.120-150కి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

కోటవురట్ల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): నిమ్మ తోటను సాగుచేసే రైతులకు చాలా కాలం తరువాత మంచిరోజులు వచ్చాయి. మార్కెట్‌లో నిమ్మకాయలకు గిరాకీ పెరిగి, ఊహించని ధర లభిస్తుండడంతో రైతులు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కిలో రూ.120 నుంచి రూ.150కి కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు.

కోటవురట్ల మండలంలో కైలాసపట్నం, లింగాపురం, విశ్వనాఽథపురం, టి.జగ్గంపేట, తిమ్మాపురం, కోటవురట్ల, అల్లుమియాపాలెం, చినబోడ్డేపల్లి, తదితర గ్రామాల్లో సుమారు 160 ఎకరాల్లో నిమ్మ తోటలు వున్నాయి. వాస్తవంగా ఒకప్పుడు మండలంలో దాదాపు 500 ఎకరాల్లో నిమ్మ తోటలు వుండేవి. వేసవిలో మినహా మిగిలిన రోజుల్లో కనీస గిట్టుబాటు ధర లభించేది కాదు. దీనికితోడు తెగుళ్ల బెడదతో కాయ దిగుబడి తగ్గిపోయింది. పలువురు రైతులు నిమ్మ తోటలను తొలగించి, వేరే పంటలను సాగు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వున్న తోటల్లో కూడా కాపు అంతంత మాత్రంగానే వుంది. అయితే సుమారు రెండు నెలల నుంచి మార్కెట్‌లో నిమ్మకాయల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో కిలో రూ.50 ధర పలకగా, గత నెలలో రూ.100కి చేరింది. రెండు వారాల నుంచి కిలో రూ.120 నుంచి రూ.150కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి నర్సీపట్నం అనకాపల్లి, విశాఖపట్నం మార్కెట్‌లకు నిమ్మకాయలను తరలిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో వివిధ కారణాల వల్ల నిమ్మ తోటల సాగు తగ్గిపోయిందని, ఉన్న తోటలకు సైతం తెగుళ్లుసోకడంతో దిగుబడి పడిపోయిందని, దీనికితోడు వేసవి కావడంతో నిమ్మకాయలకు గిరాకీ పెరిగిందని సాగుదారులు చెబుతున్నారు. ఈ ధరలు కొంచెం అటుఇటుగా వేసవి ముగిసే వరకు వుంటాయని, ఆశించిన ఆదాయం లభిస్తుందని అంటున్నారు.

Updated Date - Apr 25 , 2026 | 01:09 AM