పది రోజుల్లో వస్తానని వెళ్లి...
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:51 AM
పది రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి...ఇప్పుడు శవమై వస్తున్నాడంటూ శ్రీహరిపురానికి చెందిన పట్నాల సురేశ్ భార్య భార్గవి కన్నీరుమున్నీరుగా విలపించారు.
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి
ఒమన్ తీరంలో నౌకపై అమెరికా జరిపిన దాడిలో నగర వాసి మృతి
మల్కాపురం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి):
పది రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి...ఇప్పుడు శవమై వస్తున్నాడంటూ శ్రీహరిపురానికి చెందిన పట్నాల సురేశ్ భార్య భార్గవి కన్నీరుమున్నీరుగా విలపించారు. మెరైన్ ఇంజనీర్ అయిన సురేశ్ బుధవారం ఒమన్ తీరంలో నౌకపై అమెరికా చేసిన దాడిలో మృతిచెందారు. ఈ విషాద సంఘటనపై ఆయన భార్య భార్యవి మాట్లాడుతూ ఆ దేవుడు తమ కుటుంబానికి అన్యాయం చేశాడన్నారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా డ్రోన్ దాడి చేసిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారనే వార్త టీవీల్లో చూసి...అయ్యో పాపం అనుకున్నానని, తన భర్తే అందులో ఉన్నారనుకోలేదని రోదించారు. తమకు నయన్ (13), జతిన్ (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. తమ పిల్లలతో పాటు తన అక్క పిల్లలను కూడా తామే చూసుకుంటున్నామన్నారు. తన అక్క, బావ చనిపోవడంతో వారి పిల్లలు హరిప్రియ, హేమసాయిప్రియలను కూడా తన భర్తే చూసుకుంటున్నాడని భార్గవి తెలిపారు. ఈ ఘటనతో శ్రీహరిపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. సురేష్ ఎంతో మంచివాడని, ఆయన వద్ద పని నేర్చుకున్న వందలాది మంది ఇప్పుడు ప్రపంచ దేశాలలో పనిచేస్తున్నారని స్థానికులు చెప్పారు.
ఎమ్మెల్యే పరామర్శ
సురేష్ కుటుంబాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు (గణబాబు) పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ విషయమై ప్రధాని కూడా దిగ్ర్భాంతికి లోనయ్యారని, జిల్లా కలెక్టర్ ద్వారా తనకు సమాచారం వచ్చిన వెంటనే తహశీల్దార్‌ను పంపడం జరిగిందన్నారు. ప్రభుత్వపరంగా సహాయం అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.