Share News

విధులను వదిలేసి, రోడ్డుకడ్డంగా కాసి...

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:39 AM

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు తమ విధులను పక్కనపెట్టేసి చలాన్‌లు కట్టించే పనిలో పడ్డారు.

విధులను వదిలేసి, రోడ్డుకడ్డంగా కాసి...

ఈ-చలాన్‌ల తనిఖీలోనే ట్రాఫిక్‌ పోలీసులు నిమగ్నం

కూడళ్ల వద్ద కనిపించని వైనం

ఈ-చలాన్‌ కట్టించడం, నిబంధనలు పాటించని వారి ఫొటోలు తీయడంలోనే బిజీ

ఒకచోట గుంపుగా నిలబడి హడావిడి

ఎక్కడిక్కడ పోలీసులతో వాహనచోదకుల వాగ్వాదం

అయినా మారని తీరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు తమ విధులను పక్కనపెట్టేసి చలాన్‌లు కట్టించే పనిలో పడ్డారు. నలుగురైదుగురు కానిస్టేబుళ్లు ఒకచోటకు చేరి రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపేసి పెండింగ్‌ చలాన్‌లు తనిఖీ చేస్తున్నారు. మరికొందరు కూడళ్ల వద్ద కాకుండా కొంతదూరంలో చెట్లు, దుకాణాల చాటున నిలబడి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారికి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తున్నారు.

వాహనాల రాకపోకలు సక్రమంగా సాగిపోయేలా, వాహన చోదకులు నిబంధనలను పాటించేలా చూడడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఈ విభాగంలో పనిచేసే అధికారులు, సిబ్బంది విధిగా తమ పరిధిలోని రోడ్లు, కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌లు జరగకుండా పెట్రోలింగ్‌ చేయడం, రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలు, దుకాణాలను తొలగించడం చేయాలి. అలాగే కూడళ్ల వద్ద నిలబడి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనాలను నడిపేలా/నిలిపేలా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా హెల్మెట్‌ ధరించకుండా వాహనం నడుపుతున్నా, ట్రిపుల్‌ రైడింగ్‌ చేసినా, ఎగైనిస్ట్‌ వన్‌ వేలో వచ్చినా, సిగ్నల్‌ జంపింగ్‌ వంటి ఉల్లంఘనలకు పాల్పడినా తాము విధులు నిర్వర్తిస్తున్న కూడలి ఐలాండ్‌ నుంచే ఆ వాహనాన్ని సెల్‌ఫోన్‌తో ఫొటో తీసి ఈ-చలాన్‌ను పంపించాల్సి ఉంటుంది. అయితే నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కూడలి వద్ద పనిచేయాల్సిన సిబ్బంది, రోడ్‌లో ట్రాఫిక్‌ జామ్‌లు జరగకుండా పెట్రోలింగ్‌ చేయాల్సిన సిబ్బంది అంతా కలిసి ఒకచోట నిలబడి ఆ మార్గంలో వచ్చిపోయే వాహనాలన్నింటినీ ఆపేస్తున్నారు. వాహనం పక్కకు తీయాలంటూ హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి చేతులు అడ్డంగా పెడుతున్నారు. ఆయా వాహనాలపై పెండింగ్‌లో ఏమైనా చలాన్‌లు ఉన్నాయా?...అని ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ పెండింగ్‌ చలాన్‌లు ఉంటే అక్కడికక్కడే వాటిని చెల్లించాలంటూ కానిస్టేబుళ్లు వాహనచోదకుల ఫోన్‌ నుంచే ఫోన్‌పే ద్వారా వాటిని బలవంతంగా కట్టిస్తున్నారు. వాహన చోదకులు ఎవరైనా తాము అత్యవసర పనిపై వెళుతున్నామని, కుటుంబంతో ఉన్నామని...తమవాహనంపై పెండింగ్‌ చలాన్‌లు లేవని చెప్పినా సరే...తనిఖీ చేసేంత వరకూ ఆగాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. కూడలి వద్ద కాకుండా రోడ్డు మధ్యలో తమను ఆపడం ఏమిటని? ఎవరైనా ప్రశ్నిస్తే...తమకు ఉన్నతాధికారులు టార్గెట్‌లు ఇచ్చారని, ఆమేరకు తాము పనిచేయాల్సిందేనని సమాధానం చెబుతున్నారు. ఇదిలావుండగా కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ పోలీసులు కనిపించకపోవడంతో కొంతమంది వాహనచోదకులు సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా ముందుకువెళ్లిపోతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించాలి

సీపీ శంఖబ్రతబాగ్చి

ట్రాఫిక్‌ పోలీసులు కచ్చితంగా తమకు కేటాయించిన కూడలి వద్ద ఉండి సిగ్నల్స్‌కు అనుగుణంగా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సిందే. చలాన్‌లు జారీ లేదా పెండింగ్‌ చలాన్‌లు కట్టించడంపై నేను ఎవరికీ టార్గెట్‌లు ఇవ్వలేదు. రోడ్డు మధ్యలో గుంపుగా పోలీసులు నిలబడి హఠాత్తుగా వాహనాలను ఆపి ట్రాఫిక్‌ చలాన్‌లు తనిఖీ చేయడం చేయడం, కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డుమధ్యన ఆపి డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించడం సరికాదు. అలాంటి వారిపై తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

Updated Date - Feb 10 , 2026 | 01:39 AM