Share News

ఏయూలో లీక్‌ వీరులు

ABN , Publish Date - May 18 , 2026 | 12:41 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కొన్ని కీలక విభాగాల్లో లీక్‌ వీరులు రెచ్చిపోతున్నారు.

ఏయూలో లీక్‌ వీరులు

పీజీ, యూజీ డీన్‌, దూర విద్య డైరెక్టర్‌ కార్యాలయాల నుంచి బయటకు సమాచారం

పరీక్షల స్క్వాడ్‌ కదలికలపైనా లీక్‌

విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కొన్ని కీలక విభాగాల్లో లీక్‌ వీరులు రెచ్చిపోతున్నారు. ఉన్నతాధికారుల నిర్ణయాలను లీక్‌ చేసి క్యాష్‌ చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దూర విద్యా విభాగం, యూజీ, పీజీ, సీడీసీ డీన్‌ విభాగాల్లో ఈ తరహా లీకులు ఎక్కువగా ఉన్నట్టు చెబుతు న్నారు.

తాము తీసుకునే నిర్ణయాలను ముందుగా లీక్‌ చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు అధికారులు వాపోతు న్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిని మారిస్తేనే ఫలితం ఉంటుందని సూచించారని సమాచారం. ఏయూ పరిధి లోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇటీవల పరీక్ష లు జరిగాయి. కొన్నికేంద్రాల్లో మాస్‌ కాపీ యింగ్‌ జరుగుతోందని సమాచారం అందింది. దీంతో అధికారులు స్పెషల్‌స్క్వాడ్‌ను ఆయా కేంద్రాలకు పంపించాలని నిర్ణయించారు. విషయం తెలిసిన విభాగంలోని కొందరు సిబ్బంది వెంటనే ఆయా కాలేజీలకు సమాచా రాన్ని చేరవేశారు. దీంతో వారు అప్రమత్తమయ్యారు. డిగ్రీ, పీజీ, ఇతర ఉన్నత విద్యా కోర్సులు పూర్తిచేయలేని విద్యార్థులకు స్పెష ల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల షెడ్యూల్‌కు అధికారులు ఫైల్‌ పెట్టారు. అయితే, ప్రకటన విడుదల చేయక ముందే అనుబంధ కాలేజీలకు సమాచారం అందిపోయింది. దీంతో కొన్ని కాలేజీలు కరప త్రాల్లో పరీక్షల తేదీలను కూడా ముద్రించి విద్యార్థుల వాట్సాప్‌ల్లో పంపిస్తున్నారు. దూర విద్యా కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి నెల కొంది. ఇక్కడి అధికారులు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలను కాలేజీలకు ముందుగానే అందిస్తున్నారనే విమర్శలున్నాయి.


నేడు జీవీఎంసీ వార్డుల ముసాయిదా విడుదల

అభ్యంతరాల స్వీకరణకు వారంరోజుల గడువు

విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీలో వార్డుల సంఖ్యను 120గా నిర్ధారిస్తూ టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు పునర్విభజన ప్రక్రియను పూర్తిచేశారు. పలు సవరణల అనంతరం ముసాయిదాను జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదివారం ఆమోదించారు. డ్రాఫ్ట్‌ను సోమవారం కలెక్టరేట్‌, జీవీఎంసీ, అన్ని జోనల్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. 75 పేజీల ముసాయిదాను జీవీఎంసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని నిర్ణయించారు. వార్డుల పునర్విభజన, సరిహద్దుల నిర్ధారణపై సోమవారం నుంచి వారం రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొలిక్కివచ్చిన వార్డుల పునర్విభజన ముసాయిదా ప్రకారం భీమిలి జోన్‌ పరిధిలో కొత్తగా ఏర్పాటవుతున్న ఆరో వార్డులో అత్యధికంగా, తూర్పు జోన్‌ పరిధి 26వ వార్డులో అత్యల్పంగా జనాభా ఉన్నట్టు తెలిసింది.


ఆర్డీవో పోస్టు భర్తీ ఎన్నడో?

ఏడు నెలలుగా ఇన్‌చార్జిలతోనే విధులు

బాధ్యతల నుంచి తప్పుకోవాలని శేషశైలజ నిర్ణయం

విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):

విశాఖ రెవెన్యూ డివిజనల్‌ అధికారి పోస్టును భర్తీ చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టును ఏడు నెలలుగా ఇన్‌చార్జి అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. ఈ బాధ్యల్లో ఉన్న కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ పి.శేషశైలజ తనను రిలీవ్‌చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో పోస్టును తక్షణమే భర్తీచేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ తరువాత ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా విశాఖలోనే ఉంటాయి. వారికి ఆహ్వానం పలికే బాధ్యత ఆర్డీవోదే. దీనికి ప్రత్యేక సమయం ఉండదు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి. ఇంకా నగరంలో సగ భాగం విశాఖ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉంది. ఇతర విధులు ఉంటాయి.

ఇన్‌చార్జిలతోనే పాలన

గత ఏడాది దీపావళి రోజున అప్పటి ఆర్డీవో పి.శ్రీలేఖను బదిలీచేసిన ప్రభుత్వం, ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు. నాలుగు నెలలకుపైగా హెచ్‌పీసీఎల్‌ ఎస్డీసీ సుధాసాగర్‌ ఇన్‌చార్జి వ్యవహరించారు. అతనిని విజయనగరం బదిలీచేసిన తరువాత కేఆర్‌ఆర్‌ఈ ఎస్డీసీ శేషశైలజకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె వ్యక్తిగత నిర్ణయాలతో తప్పుకోవాలని నిర్ణయించారు. దీంతో ఆర్డీవోగా సీనియర్‌ను నియమించాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం ఉన్న అధికారి సేవలు అవసరమని కోరారు. నగరంలో ముగ్గురు, నలుగురు ఎస్డీసీలున్నా ఆయా విభాగాల పనుల్లో బిజీగా ఉన్నందున కొత్త అధికారిని పంపాలని కోరారు. ప్రస్తుతం ఎస్డీసీగా పనిచేస్తున్న అధికారి ఆర్డీవోగా వచ్చేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి సిఫారుసు చేయించారు. కానీ అవి ఫలించలేదని తెలిసింది. విశాఖపై ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్‌ దృష్టి ఎక్కువగా ఉండడంతో సమీకరణలను అంచనావేసి ఆర్డీవోను నియమిస్తారని భావిస్తున్నారు.

Updated Date - May 18 , 2026 | 07:46 AM