ఉక్కుకు అంకురార్పణ
ABN , Publish Date - Mar 24 , 2026 | 01:07 AM
నక్కపల్లి ప్రాంతంలో భారీ స్టీల్‌ప్లాంటు ఏర్పాటుతో ప్రపంచ పారిశ్రామిక పటంలో ఉత్తరాంధ్రకు మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించనున్నది.
ఏఎం/ఎన్‌ఎస్-ఇండియా స్టీల్‌ప్లాంటుకు భూమి పూజ
సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్,
కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కంపెనీ పెద్దలు హాజరు
రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి, లక్ష మందికి ఉపాధి
బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు
నక్కపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
నక్కపల్లి ప్రాంతంలో భారీ స్టీల్‌ప్లాంటు ఏర్పాటుతో ప్రపంచ పారిశ్రామిక పటంలో ఉత్తరాంధ్రకు మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించనున్నది. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలు ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా (ఏఎం/ఎన్‌ఎస్-ఇండియా) సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంటుకు సోమవారం సాయంత్రం నక్కపల్లి మండలం చందనాడ శివారు పాటిమీద గ్రామం వద్ద బీజం పడింది. రాష్ట్రంలో ఇంతభారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న తొలిపరిశ్రమ ఇదే కావడంతో అనకాపల్లి జిల్లా వాసులతోపాటు ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించే ఈ ఉక్కు ఫ్యాక్టరీకి సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. మొదటి దశను సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులతో 9.2 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 2029 నాటికి పూర్తిచేయాలని కంపెనీ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం రెండో దశ పనులను సుమారు రూ.65 వేల కోట్లతో చేపట్టి 2030 సంవత్సరాంతానికి పూర్తిచేయాలన్న సంకల్పంతో ఏఎం/ఎన్‌ఎస్-ఇండియా ఉంది. తద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించడం ఉత్తరాంధ్ర వాసులను...ముఖ్యంగా నిరుద్యోగ యువతను సంతోషపరిచింది. స్టీల్‌ప్లాంటు నిర్మాణం ఎలా ఉంటుందన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజనరీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించడంతోపాటు విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తామని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.
సభ సక్సెస్
ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా కంపెనీ సంయుక్తంగా ఏర్పాటుచేయనున్న స్టీల్‌ప్లాంటుకు భూమి పూజ, బహిరంగసభ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా భావించింది. సభకు అనకాపల్లి జిల్లాలోని అన్ని మండలాల నుంచి కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరికోసం అధికారులు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేశారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూటమి శ్రేణులతోపాటు మహిళలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభాప్రాంగణం మొత్తం నిండిపోవడంతో పలువురు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆయా ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్ల ద్వారా కార్యక్రమాన్ని వీక్షించారు. స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ, బహిరంగ సభ విజయవంతం కావడంతో కూటమి నేతల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
షెడ్యూల్ ప్రకారమే..
స్టీల్‌ప్లాంటు శంకుస్థాపన, సభా నిర్వహణ వంటి కార్యక్రమాలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరిగాయి. సీఎం చంద్రబాబునాయుడు సాయంత్రం 3.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇక్కడకు చేరుకోగా..కొద్దిసేపటికే కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేర్వేరు హెలికాప్టర్లలో వచ్చారు. వీరికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 4.14 గంటలకు స్టీల్‌ప్లాంటు ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ చేసి, అక్కడున్న నమూనాల డాక్యుమెంటరీలను తిలకించారు. అనంతరం అందరూ కలిసి సభా వేదికపైకి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు గ్యాలరీ నుంచి ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
స్టీల్ ప్లాంటు ద్వారా లక్ష మందికి ఉపాధి
పాయకరావుపేట నియోజకవర్గ యువతకు అవకాశం
ఫ్యాక్టరీకి ‘పోలవరం’ నీరు
జూలైలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం
మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన కార్యక్రమంలో
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
నక్కపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ (ఏఎం/ఎన్‌ఎస్-ఇండియా) కంపెనీలు సంయుక్తంగా నిర్మించే ఉక్కు ఫ్యాక్టరీతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పాటిమీద గ్రామంలో సోమవారం సాయంత్రం స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ. స్టీల్‌ప్లాంట్ వల్ల ఆర్థికాభివృద్ధితోపాటు విద్య, వైద్య, ఉపాధి రంగాలు మెరుగుపడతాయన్నారు. ఉద్యోగావకాశాల్లో పాయకరావుపేట నియోజకవర్గం యువతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ‘స్టీల్ సిటీ’గా గుర్తింపు పొందుతుందని చెప్పారు. దీనిని ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి త్వరగా నిర్మాణమయ్యేలా అన్నివిధాలా సహకారం అందిస్తామని కంపెనీ యాజమాన్య ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
జిల్లా రైతులతోపాటు ఇక్కడ ఏర్పాటుచేసే స్టీల్‌ప్లాంటుకు పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని అందిస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు రవాణా సదుపాయం కోసం జాతీయ రహదారి నుంచి నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తున్నామన్నారు. రెండు దశల్లో నిర్మించే ఈ స్టీల్ ప్లాంటు ద్వారా లక్ష మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. స్టీల్‌ప్లాంటు అవసరాల కోసం 316 ఎకరాల్లో రూ.11,195 కోట్లతో క్యాప్టివ్ పోర్టు నిర్మాణం జరుగుతుందని, దీని ద్వారా ఆరు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. విశాఖ ఉక్కు మన ఆత్మగౌరవానికి ప్రతీక అయితే, నక్కపల్లి స్టీల్‌ప్లాంటు మన సత్తాను చాటిచెబుతుందని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలైలో ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు చాలా మంచివారని, వారికి సహకరించాలని ఏఎం/ఎన్‌ఎస్ (ఇండియా) ప్రతినిధులకు సూచించారు.
రైతుల త్యాగం మరువలేనిది
చంద్రబాబుపై నమ్మకంతోనే భూములు ఇచ్చారు
హోం మంత్రి అనిత
నక్కపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉన్న విశ్వాసం, నమ్మకంతోనే స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు ఈ ప్రాంత రైతులు భూములిచ్చారని, వారి త్యాగం మరువలేనిదని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్టీల్‌ప్లాంటు శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రపంచస్థాయి ఉక్కు ఉత్పత్తి దిగ్గజాలైన ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కంపెనీలు ఇక్కడ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయడం తమ ప్రాంత ప్రజలకు ఒక వరమన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో నక్కపల్లి ప్రాంతానికి ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గానికి మహర్దశ పడుతుందని, ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని అన్నారు. స్టీల్‌ప్లాంటు ఏర్పాటుతో ఇక్కడే ఉపాధి లభించి, వలసలు తగ్గిపోతాయని, అంతేకాక వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె అన్నారు.