Share News

గ్రేటర్‌ ఎన్నికలపై తాజా మాజీల గురి

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:02 AM

ఐదేళ్ల పదవీకాలం పూర్తవ్వడంతో ఇటీవలే మాజీలుగా మారిన కార్పొరేటర్లంతా జీవీఎంసీ ఎన్నికలపైనే గురిపెట్టారు.

గ్రేటర్‌ ఎన్నికలపై తాజా మాజీల గురి

ఎన్నికలు ఎప్పుడు జరిగినా బరిలోకి దిగేలా కార్యాచరణ

పదవీకాలం ముగిసినా వార్డుల్లో క్రియాశీలకంగా కార్యక్రమాలు

పోటీగా ఆశావహులు, గత ఎన్నికల్లో ఓటమి పాలైనవారు కూడా కార్యక్రమాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఐదేళ్ల పదవీకాలం పూర్తవ్వడంతో ఇటీవలే మాజీలుగా మారిన కార్పొరేటర్లంతా జీవీఎంసీ ఎన్నికలపైనే గురిపెట్టారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి పోటీచేసి కౌన్సిల్‌లో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఆరు నెలల్లోగా ఎన్నికలు జరుపుతామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించడంతో మాజీలుగా మారిపోయినప్పటికీ అందరూ వార్డుల్లో మాత్రం గతంలో మాదిరిగానే కలియతిరుగుతున్నారు.

జీవీఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం ఈనెల 17వ తేదీతో ముగిసింది. దీంతో కార్పొరేటర్లంతా మాజీలుగా మారిపోయారు. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రస్తుతం కులగణన ప్రక్రియ నడుస్తోంది. పరీక్షలు సీజన్‌ కావడంతో ఆరు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. దీంతో తాజాగా మాజీలైన కార్పొరేటర్లంతా ప్రజల్లో తమ పట్టును, పరిచయాలను కొనసాగించడంపై దృష్టిపెట్టారు. వార్డులో తిరగడం మానేసినా, ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకపోయినా ఎన్నికలొస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి పోటీ చేయడంతోపాటు కార్పొరేటర్‌గా జీవీఎంసీ కౌన్సిల్‌లో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నవారంతా...వార్డు పరిధిలో ఏదైనా వేడుక జరిగినా, ఎవరైనా మృతిచెందినా, అనారోగ్యానికి గురైనా, ప్రమాదానికి గురైనాసరే వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా పనిలోపనిగా తాము కార్పొరేటర్‌గా ఐదేళ్లలో వార్డులో చేసిన అభివృద్ధి పనులు, సాధించిన నిధులు, వార్డు సమస్యలపై కౌన్సిల్‌లో చేసిన పోరాటాల గురించి సందర్భానుసారం ఉపన్యాసాలు ఇస్తున్నారు. కార్పొరేటర్‌ పదవీకాలం ముగిసినప్పటికీ ప్రతిరోజూ వార్డులో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ వారితో అనుబంధాన్ని కొనసాగించేందుకు ఆరాటపడుతున్నారు. తాజాగా మాజీ కార్పొరేటర్లతోపాటు కొత్తగా కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న నేతలు, గత ఎన్నికల్లో ఓటమిపాలైనవారు కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా బరిలోకి దిగాలనే ఉద్దేశంతో వార్డుల్లో కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. ‘జీవీఎంసీకి ఎప్పుడు ఎన్నికలు జరగొచ్చు’ అంటూ...తమకు తెలిసిన అధికారులు, ప్రజా ప్రతినిధులను అడుగుతున్నారు. భీమిలి, పెందుర్తి, పధ్మనాభం, ఆనందపురం మండలాల్లోని గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేస్తారా?, ఒకవేళ విలీనం జరిగితే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతుందా?...అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.


నీటి భద్రతకు కార్యాచరణ

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

నీటి కష్టాలు లేని నగరాన్ని

ఆవిష్కరించేందుకు తమ వంతు కృషిచేయాలని నగరవాసులకు పిలుపు

విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

భవిష్యత్తులో నగరానికి అవసరమైన నీటి భద్రత కల్పించేందుకు దీర్ఘకాలిక కార్యాచరణకు జీవీఎంసీ కట్టుబడి ఉందని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ప్రపంచ జల దినోత్సవం నేపథ్యంలో నీటిని ఆదా చేయడం, వృథాను అరికట్టడంలో నగరవాసులు తమ వంతు పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. వేసవి నేపథ్యంలో ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ప్రస్తుతం నగరానికి 400 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉంటుందని, 2047 నాటికి డిమాండ్‌ 726 ఎంఎల్‌డీకి పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. దీనిని సాధించేందుకు జీవీఎంసీ ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. అందులో భాగంగానే ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ), సింగపూర్‌ వాటర్‌ సెంటర్‌, పీయూబీ సింగపూర్‌, ఆస్ర్టేలియాకు చెందిన ఐఎస్‌ఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థల సాంకేతిక సహకారంతో నీటి భద్రతకు ప్రణాళిక తయారుచేస్తున్నామన్నారు. ‘డ్రింక్‌ ఫ్రమ్‌ ట్యాప్‌ (టీఎఫ్‌టీ)’ పేరుతో ఇళ్లకు నిరంతర నీటి సరఫరా చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. నగరవాసులు నీటి పొదుపును పాటించడం ద్వారా భవిష్యత్తులో నీటి కష్టాలు లేని నగరాన్ని ఆవిష్కరించేందుకు తమ వంతు కృషిచేయాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు.


పన్ను వసూళ్లలో మహా జోరు

బకాయిలపై 50 శాతం

వడ్డీ రాయితీ ప్రకటనతో జోష్‌

మూడు రోజుల్లో రూ.12 కోట్లు రాక

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్లు రావచ్చునని జీవీఎంసీ అధికారుల అంచనా

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన వడ్డీపై 50 శాతం రాయితీ కలిసివస్తోంది. ఈ నెలాఖరు నాటికి బకాయిలను పూర్తిగా చెల్లించిన వారికి మాత్రమే వడ్డీ రాయితీ వర్తిస్తుందని షరతు పెట్టడంతో బకాయిదారులంతా తమ పన్ను చెల్లించేందుకు ముందుకొస్తున్నారు.

జీవీఎంసీకి ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను (వీఎల్‌టీ) కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు పన్ను వసూలు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్చి 15జ తేదీ నాటికి రూ.500 కోట్లు వసూలైంది. ఈ నెలాఖరునాటికి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి అప్పటికి మరో రూ.80 కోట్లు వసూలవుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. కాగా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16న ఉత్తర్వులు జారీచేసింది. ఇది పన్ను వసూళ్లను మరింత పెంచుతుందని అధికారులు భావించారు. అయితే వడ్డీ మాఫీ ప్రకటించిన తర్వాత పదిహేడో తేదీన వెబ్‌సైట్‌ పనిచేయకపోవడంతో వడ్డీ రాయితీ ఆప్షన్‌ ఆన్‌లైన్‌లో కనిపించలేదు. దీనివల్ల ఆస్తి పన్ను బకాయిలు చెల్లించి వడ్డీ మాఫీ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సౌకర్యం కేంద్రాలకు వెళ్లినవారు, ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించేందుకు ప్రయత్నించినవారు రాయితీ వర్తించదనే కారణంతో చెల్లింపులను వాయిదా వేసుకున్నారు. పద్దెనిమిదో తేదీ నుంచి రాయితీ ఆప్షన్‌ అందుబాటులోకి రావడంతో బకాయిల చెల్లింపునకు ఎగబడ్డారు. తర్వాత రోజు ఉగాది కాగా శుక్రవారం పన్నుల వసూళ్లు పెరిగాయి. ఈనెల పద్దెనిమిది నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల్లో దాదాపు రూ.12 కోట్లు పన్ను వసూలైంది. అందులో వడ్డీ మాఫీ రాయితీ పొందినవారు చెల్లించిన మొత్తమే 60 శాతానికి పైగా ఉంటుందని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అంటే రాయితీ సదుపాయం ఏ స్థాయిలో ప్రభావం చూపుతోందనేది స్పష్టమవుతుతోంది. సోమవారం నుంచి మరింతగా పన్ను వసూళ్లు పెరుగుతాయని, నెలాఖరు నాటికి రూ.600 కోట్లకు చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీ కారణంగా తాము అంచనా వేసిన మొత్తం కంటే రూ.20 కోట్లు వరకు అదనంగా వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.


కొండెక్కిన కోడి

కిలో స్కిన్‌లెస్‌ రూ.336

డిమాండ్‌కు తగ్గట్టుగా కోళ్ల లభ్యత లేకపోవడమే ధర పెరుగుదలకు కారణం

మరికాస్త పెరిగే అవకాశం లేకపోలేదంటున్న పౌల్ర్టీ వర్గాలు

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

బ్రాయిలర్‌ కోడి మాంసం ధర రికార్డు స్థాయికి చేరింది. కోడి కిలో ఫారం వద్ద రూ.158, రిటైలర్‌ వద్ద రూ.178, స్కిన్‌లెస్‌ కిలో రూ.336గా నిర్ణయించినట్టు బ్యాగ్‌ అసోసియేషన్‌ శనివారం ప్రకటించింది. కొత్త ధర ఆదివారం మార్కెట్‌లో అమలవుతుందని పేర్కొంది. గత నెల చివరి వారంలో కిలో స్కిన్‌ లెస్‌ రూ.310 మార్కు దాటింది. ఆ తరువాత పది రోజులకు మరో రూ.4 పెరిగి, అప్పటి నుంచి అదే ధర కొనసాగుతుంది. అయితే డిమాండ్‌కు తగినట్టుగా కోళ్లు అందుబాటులో లేకపోవడంతో కిలోకు ఒక్కసారిగా రూ.22 పెంచేశారు. పౌలీ్ట్ర చరిత్రలో స్కిన్‌లెస్‌ కిలో రూ.336కు చేరడం రికార్డుగా బ్యాగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధి అప్పారావు తెలిపారు.

మార్కెట్‌లో డిమాండ్‌కు తగినంతగా ఫారాల్లో కోళ్ల లభ్యత లేదు. ఈ పరిస్థితి కేవలం ఉత్తరాంధ్రలోనే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉంది. రెండు, మూడు రోజుల క్రితం వరకూ ఒడిశాలో ధర తక్కువగా ఉండేది. శుక్రవారం నుంచి ధరలు పెరగడంతో ఉత్తరాంధ్ర నుంచి ఒడిశాకు ఎగుమతులు నిలిచిపోయాయని చెబుతున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో రేట్లు మరింత ఎక్కువగా ఉన్నట్టు బ్యాగ్‌ ప్రతినిధి అప్పారావు తెలిపారు. గత ఏడాది సంక్షోభంతో చాలామంది రైతులతో పాటు కంపెనీలు కోళ్ల పెంపకాన్ని నిలిపివేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం కోడి పిల్లలను ఉత్పత్తి చేసే తల్లి కోళ్లకు తీవ్రమైన కొరత ఉందని, దీంతో కోడిపిల్ల ధర రూ.60కు చేరిందని తెలిపారు. దీంతో చిన్నపాటి రైతులు కోళ్ల పెంపకం వైపుగా రావడం లేదన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా కోళ్లు సరఫరా అయ్యేంత వరకూ ఇవే ధరలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ధరలు మరింత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వివరించారు.

Updated Date - Mar 22 , 2026 | 01:02 AM