28న జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశం
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:37 AM
జీవీఎంసీ సర్వసభ్య సమావేశం ఈనెల 28న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
37 అంశాలతో అజెండా
విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ సర్వసభ్య సమావేశం ఈనెల 28న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు 37 అంశాలతో అజెండా తయారుచేసి సభ్యులకు ఇప్పటికే అందజేశారు. జీవీఎంసీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం వచ్చే నెల 17వ తేదీతో ముగుస్తుండడంతో ఇదే చివరి సమావేశం కానున్నది. ఈ నేపథ్యంలో టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలను కౌన్సిల్ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన అజెండాలో ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్‌కు సంబంధించిన అంశాలు, ఐటీ విభాగంలో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు, సర్వర్ల నిర్వహణకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తున్న 17 మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాల చెల్లింపు, వీధి దీపాల విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 63 మంది సిబ్బంది కొనసాగింపు, హార్టికల్చర్ విభాగంలో పనిచేస్తున్న 37 మంది సిబ్బంది కొనసాగింపు, ప్రజారోగ్య విభాగంలో పారిశుధ్య నిర్వహణ, నివాసాల నుంచి ఘనవ్యర్థాల సేకరణ/నిర్వహణ, రోడ్లపై కుక్కలు, పందులు, పశువుల నియంత్రణ, డెంగ్యూ, మలేరియా నివారణకు జీటీఎస్ కేంద్రాల్లో పనిచేస్తున్న 5,468 మంది పొరుగు సేవల సిబ్బంది సేవలు మరో ఏడాది పొడిగింపుతోపాటు వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపే అంశాలను చేర్చారు.
ఇద్దరు అధికారులు సరండర్
విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):
హైకోర్టు ఆదేశాల మేరకు 2018లో గ్రూపు-1కు ఎంపికైన ఇద్దరు అధికారులను సరండర్ చేశారు. జిల్లా ఖజానా కార్యాలయంలో ఏటీవోగా పనిచేస్తున్న నితిన్‌జోషితో పాటు పద్మనాభం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న కుంచాడ రూపేష్‌ను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రమే బాధ్యతల నుంచి తప్పించి సరండర్ చేశారు. పద్మనాభం ఎంపీడీవో బాధ్యతలను తాత్కాలికంగా భీమిలి ఎంపీడీవో కార్యాలయ ఏవోకు, జిల్లా ఖజానా కార్యాలయంలో ఏటీవో బాధ్యతలను అక్కడనున్న మరో అధికారికి అప్పగించారు.
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు
రూ.లక్ష జరిమానా
విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):
బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్య చేసిన కేసులో ముద్దాయికి ఇరవై ఏళ్లపాటు కారాగార శిక్ష విధిస్తూ విశాఖలోని పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పి.మంగకుమారి గురువారం తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో ఒక గ్రామానికి చెందిన పాంగి రమేశ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2024 జనవరి 2వ తేదీన అదే గ్రామంలో పీవీటీజీకి చెందిన ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేశాడు. చున్నీతో దూలానికి ఉరివేసి, బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్థులు భావించేలా చేశాడు. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి చింతపల్లి ఏఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిశోర్ పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు పూర్తయిన తరువాత పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో ముద్దాయి పాంగి రమేశ్‌కు 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ములో రూ.50 వేలు బాధిత కుటుంబానికి, రూ.50 వేలు ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు.