Share News

వాహనాల వేగానికి లేజర్‌గన్స్‌తో కళ్లెం

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:17 AM

నగరంలో వాహనాల వేగానికి లేజర్‌ గన్స్‌ (ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలు)తో కళ్లెం వేయాలని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి నిర్ణయించారు.

వాహనాల వేగానికి లేజర్‌గన్స్‌తో కళ్లెం

నగరంలో పదిచోట్ల ఏర్పాటుకు సీపీ నిర్ణయం

ప్రస్తుతం రెండు లేజర్‌ గన్స్‌ సమకూర్చిన జీవీఎంసీ

తొలిరోజే వాటితో 210 కేసులు నమోదు

2,461 ఈ-చలాన్‌లు జారీ

హెల్మెట్‌ ధరించనందుకు 1,285,

ట్రిపుల్‌ రైడింగ్‌కు 79, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కు 22...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో వాహనాల వేగానికి లేజర్‌ గన్స్‌ (ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలు)తో కళ్లెం వేయాలని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి నిర్ణయించారు. ఇందుకోసం పది లేజర్‌ గన్స్‌ను జీవీఎంసీ, పరిశ్రమలు నుంచి సీఎస్‌ఆర్‌ నిధులతో సమకూర్చుకునేలా కార్యాచరణ రూపొందించారు. సీఎస్‌ఆర్‌ కింద రూ.18 లక్షలతో కొనుగోలు చేసిన రెండు లేజర్‌ గన్స్‌ను సీపీకి శుక్రవారం జీవీఎంసీ కమిషనర్‌ అప్పగించారు. వాటితో శనివారం ఒక్కరోజే ఓవర్‌ స్పీడ్‌తో ప్రయాణిస్తున్న 210 వాహనాలపై కేసులు నమోదుచేశారు.

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏటా 1,100కిపైగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతుంటాయి. ప్రమాదాల్లో సగటున ఏటా 400 మంది ప్రాణాలు కోల్పోతుండగా, మరో 1,500 మంది క్షతగాత్రులవుతున్నారు. వాహన చోదకులు త్వరగా గమ్యం చేరుకోవాలనే ఆత్రుతలో అపరిమిత వేగంతో నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసులు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో నగరంలో వాహనాల వేగానికి కళ్లెం వేయడంతోపాటు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు అడ్డుకట్టవేయడానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డ్రైవెన్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలని సీపీ భావించారు. అయితే నిధుల సమస్య కారణంగా ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దానికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో లేజర్‌ గన్స్‌ను సమకూర్చుకుంటే వాహనాల వేగానికి కళ్లెం వేయవచ్చునని గుర్తించారు. ఒక్కో లేజర్‌ గన్‌ కొనుగోలుకు రూ.తొమ్మిది లక్షలు అవుతుంది. నగరంలోని ప్రధాన రహదారులపై పది లేజర్‌ గన్స్‌ను ఏర్పాటుచేసి ఓవర్‌స్పీడ్‌కు అడ్డుకట్ట వేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిని పరిశ్రమలు, జీవీఎంసీ ఆర్థిక సహాయంతో సమకూర్చుకునేలా ప్రయత్నాలు చేశారు. సీపీ విజ్ఞప్తి పట్ల జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సానుకూలంగా స్పందించి రూ.18 లక్షలతో రెండు లేజర్‌ గన్స్‌ను అందజేశారు.

జీవీఎంసీ అందజేసిన రెండు లేజర్‌ గన్స్‌ను నగర ట్రాఫిక్‌ పోలీసులు శనివారం నుంచే రంగంలోకి దింపారు. రెండుచోట్ల ప్రధాన రహదారులపై పెట్టి ఓవర్‌స్పీడ్‌తో వెళ్లే వాహనాలపై కేసులు నమోదుచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిర్దేశించిన దానికంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్న 210 వాహనాలను గుర్తించి కేసులు నమోదుచేసి, ఈ-చలాన్‌ను జారీచేశారు. రోడ్డుపై ఎక్కడా పోలీసులు కనిపించడం లేదనే భావనతో అపరిమిత వేగంతో వాహనాలను నడిపిన వారంతా ఈ-చలాన్‌కు సంబంధించిన మెసేజ్‌ సెల్‌ఫోన్‌కు రావడం చూసి అవాక్కయ్యారు. ఇకపై నగర పరిధిలో అపరిమిత వేగంతో వాహనం నడిపితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. లేజర్‌ గన్స్‌ వినియోగంపై నగర ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారుల వద్ద ప్రస్తావించగా నగర పరిధిలో శనివారం ఒక్కరోజే వివిధ ఉల్లంఘనలకు సంబంధించి వాహన చోదకులకు 2,461 ఈ-చలాన్‌లు జారీచేసినట్టు తెలిపారు. అందులో హెల్మెట్‌ ధరించనందుకు 1,285, పిలియన్‌ డ్రైవర్‌ హెల్మెట్‌ ధరించనందుకు 227, ట్రిపుల్‌ రైడింగ్‌కు 79, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కు 22 ఈ-చలాన్‌లు జారీ అయ్యాయన్నారు. రాంగ్‌ పార్కింగ్‌కు 155, ఎంవీ యాక్ట్‌ ఉల్లంఘనపై 473, ఇతర అభియోగాలపై మరికొన్ని కేసులు నమోదుచేసి 40 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని లేజర్‌ గన్స్‌ అందుతాయని, ఓవర్‌స్పీడ్‌పై మరిన్ని కేసులు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 01:17 AM