Share News

హెచ్‌ఎస్‌ఎల్‌ డ్రైడాక్‌కు అతి పెద్ద నౌక

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:10 AM

ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని జడ్పీ, ప్రభుత్వ, జీవీఎంసీ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 50 అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

హెచ్‌ఎస్‌ఎల్‌ డ్రైడాక్‌కు అతి పెద్ద నౌక

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) తొలిసారిగా నేవీకి చెందిన అతి పెద్ద నౌక (ల్యాండింగ్‌ ప్లాట్‌ఫారం డాక్‌...ఎల్‌పీడీ)ను డ్రై డాక్‌లోకి గురువారం విజయవంతంగా తీసుకువచ్చింది. హెచ్‌ఎస్‌ఎల్‌ చరిత్రలో ఇంత పెద్ద నౌకను డ్రై డాక్‌ను ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకురావడం ఇదే తొలిసారి. ఈ ఎల్‌పీడీ పొడవు 175 మీటర్లు, వెడల్పు 28 మీటర్లు. సూక్ష్మమైన ప్రణాళిక, పర్యవేక్షణ, హెవీ ఇంజనీరింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడా ఎటువంటి డ్యామేజీ జరగకుండా నౌకను డ్రై డాక్‌లోకి తీసుకువచ్చినట్టు షిప్‌యార్డ్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీని ద్వారా అతి పెద్ద ఎల్‌పీడీలకు కూడా హెచ్‌ఎస్‌ఎల్‌లో రీఫిట్‌ పనులు చేయవచ్చుననే భరోసా నేవీకి లభించినట్టయింది.


కాపులుప్పాడలో అదానీ ఆస్పత్రి

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం

మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలతో పాటు ఇంటర్నేషనల్‌ స్కూల్‌, స్కిల్‌ అకాడమీ కూడా ఏర్పాటు

రూ.2,168 కోట్ల పెట్టుబడి

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

అదానీ గ్రూపు విశాఖపట్నంలో అది పెద్ద ఆస్పత్రిని నిర్మించనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అదానీ ఫౌండేషన్‌కు కాపులుప్పాడలో 60.29 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో రూ.2,168 కోట్లతో వైద్య, ఆరోగ్య, విద్యా రంగానికి సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేయనున్నాయి. మొత్తం వేయి పడకలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తారు. దానికి అనుబంధంగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తారు. అందులో 150 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతం వారికి ప్రాధాన్యం ఉంటుంది. వాటితో పాటు నర్సింగ్‌ కాలేజీ వస్తుంది. అలాగే ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను కూడా ప్రారంభిస్తారు. వివిధ రంగాల్లో పనిచేసేవారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి స్కిల్‌ అకాడమీని కూడా నెలకొల్పుతారు. ఇందులో ఒక్క ఆస్పత్రి నిర్మాణానికే రూ.713 కోట్లు వెచ్చించనున్నట్టు సమాచారం. అదానీ గ్రూపు విశాఖపట్నంలో వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తోంది. తొలుత గంగవరం పోర్టును హస్తగతం చేసుకుంది. డేటా సెంటర్‌ ఏర్పాటుకు మధురవాడలో 170 ఎకరాల భూమిని తీసుకుంది. తాజాగా గూగుల్‌ డేటా సెంటర్‌తో చేయి కలిపి నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకుంది. ఈ పనులన్నింటినీ దశల వారీగా చేపడతారని అధికార వర్గాలు తెలిపాయి.


జిల్లాకు 50 అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని జడ్పీ, ప్రభుత్వ, జీవీఎంసీ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 50 అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను పరిగణనలోకి తీసుకుని ఈ నియామకాలు చేపట్టనున్నారు. దీని ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో హిందీ..15, బయాలజీ 11, సోషల్‌ స్టడీస్‌ 10, ఇంగ్లీష్‌ ఐదు, తెలుగు నాలుగు, ఉర్దూ ఒకటి, ఎస్జీటీ కేటగిరీలో నాలుగు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ జారీచేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పది నెలల కాలానికి మాత్రమే నియామకం ఉంటుందని, నెలకు స్కూల్‌ అసిస్టెంట్‌లకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందని డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు మండల విద్యాశాఖాధికారుల ద్వారా డీఈవోకు సమర్పించాలి. అన్ని ప్రక్రియలు పూర్తయిన తరువాత స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ద్వారా ఈనెల 30వ తేదీ నుంచి 31వలోగా నియామక ఉత్తర్వులు అందజేస్తారని, సెప్టెంబరు ఒకటో తేదీన విధుల్లో చేరాలని డీఈవో తెలిపారు.


సీబీఐ డీఎస్పీ సంజయకుమార్‌కు రాష్ట్రపతి పతకం

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

విశాఖలో సీబీఐ డీఎస్పీగా పనిచేస్తున్న సంజయకుమార్‌ సమాల్‌కు రాష్ట్రపతి పతకం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి పతకానికి కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఆరుగురు సీబీఐ అధికారులను ఎంపిక చేసింది. అందులో సమాల్‌ ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన వచ్చింది.

Updated Date - Aug 15 , 2026 | 01:10 AM