Share News

జలాశయాల నుంచి భారీగా నీరు విడుదల

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:41 AM

అక్వాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల నుంచి బుధవారం భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయాల నుంచి భారీగా నీరు విడుదల
జోలాపుట్టు జలాశయం నుంచి నీరు విడుదల చేస్తున్న దృశ్యం

అక్వాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ముందస్తు చర్యలు

జోలాపుట్టు నుంచి 10 వేలు, డుడుమ నుంచి 1,000 క్యూసెక్కులు దిగువకు...

ముంచంగిపుట్టు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అక్వాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల నుంచి బుధవారం భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జలాశయాల్లో నీటిమట్టాలను నియంత్రించేందుకు ముందస్తుగా నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జోలాపుట్టు జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2,750 అడుగులు కాగా, ప్రస్తుతం 2,746.30 అడుగులకు చేరింది. దీంతో జోలాపుట్టు జలాశయం నుంచి దిగవ ప్రాంతానికి సుమారు 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే డుడుమ జలాశయంలో 2,590 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,582.30 అడుగులు ఉంది. ఇక్కడ నుంచి దిగువ ప్రాంతంలో ఉన్న బలిమెలకు 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని విడుదల చేస్తున్నామని, వర్షాలు కురిస్తే నీటి విడుదలను పెంచే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

బలిమెల, గుంటవాడ నుంచి కూడా...

సీలేరు: అక్వాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఆదేశాల మేరకు బలిమెల రిజర్వాయర్‌ నుంచి మంగళవారం రాత్రి నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సీలేరు జెన్‌కో ఎస్‌ఈ జాకీర్‌ హుస్సేన్‌, ఈఈ అప్పలనాయుడు, ఏడీఈ జైపాల్‌, ఏఈ సురేష్‌లు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. బలిమెల జలాశయం నుంచి గుంటవాడ జలాశయంలోకి బుధవారం 25,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గుంటవాడ రిజర్వాయర్‌ డ్యామ్‌ 19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గుంటవాడ రిజర్వాయర్‌ 20 గేట్లు ద్వారా 21 వేల 600 క్యూసెక్కులు, జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా ఆరు వేల క్యూసెక్కుల నీటిని డొంకరాయి రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో డొంకరాయి రిజర్వాయర్‌కు 23 వేల 249 క్యూసెక్కుల నీరు చేరుతుంది. అలాగే డొంకరాయి మెయిన్‌డ్యామ్‌ 5 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో ప్రాజెక్టుల దిగువనున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు రిజర్వాయర్‌ దిగువకు వెళ్లరాదని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని జెన్‌కో అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Nov 19 , 2026 | 12:41 AM