భూ బకాసురులు!
ABN , Publish Date - May 14 , 2026 | 12:54 AM
జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ కొరవడింది. కొందరు అదే పనిగా ప్రభుత్వ ఖాళీ జాగాలు ఎక్కడున్నాయో వెతికి మరీ పాగా వేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల సహకారంతో విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేస్తున్నారు.
యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా
తప్పుడు సర్వే నంబర్లతో హస్తగతం
రాజకీయ నాయకుల సహకారంతో ఆక్రమణలు
ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోని అధికారులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ కొరవడింది. కొందరు అదే పనిగా ప్రభుత్వ ఖాళీ జాగాలు ఎక్కడున్నాయో వెతికి మరీ పాగా వేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల సహకారంతో విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేస్తున్నారు. అడ్డుకునే వారు లేకపోవడంతో చెలరేగిపోతున్నారు. అధికారులకు తెలిసినా పట్టనట్టే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
గత వైసీపీ పాలకులు కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలో విస్సన్నపేటలో కోట్ల రూపాయల విలువ చేసే డీపట్టా భూములు, కొండలు, గోర్జలు, వాగులు తమ అనుచరుల ప్రైవేటు లేఅవుట్‌లో కలిపేసుకున్న విషయం తెలిసిందే. ఈ భూములపై విచారణ జరపాలని అప్పట్లో స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై కూటమి ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించించి ఏడాదిన్నర కావస్తున్నా, విచారణ నత్తనడకన సాగుతోంది. కనీసం విచారణ ఏ దశలో ఉందనే సమాచారం స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ భూములకు రక్షణ ఉంటుందని, గత వైసీపీ పాలకులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికి చెందేలా కఠినంగా వ్యవహరిస్తుందని అందరూ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ మాత్రం మార్పు రాకపోగా అక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విచారణ జరపడంలో మీనమేషాలు
జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపణలు, ఫిర్యాదులు అందిన సందర్భంలో రెవెన్యూ అధికారులు విచారణ జరపాల్సి ఉంటుంది. కానీ మండల రెవెన్యూ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. మీడియాలో కథనాలు వచ్చినా కనీసం విచారణ జరపడం లేదు. పైగా కొందరు తహశీల్దార్లు ఆక్రమణదారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములను కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అనకాపల్లి పట్టణంలో దేవదాయ శాఖకు చెందిన రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఒక రెవెన్యూ ఉన్నతాధికారి ఏకంగా ఎండార్స్‌మెంట్ లేఖ ఇచ్చేశారు. తీరా మీడియా ద్వారా అవి దేవదాయ శాఖకు చెందిన భూములుగా వెలుగులోకి రావడంతో వెనక్కి తగ్గారు. ఆ భూములు మావంటూ దరఖాస్తు చేసుకున్న వ్యక్తులపై మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేశారు. ఇంత వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. 22ఏ ప్రభుత్వ రెవెన్యూ రికార్డులో ఉన్న దేవదాయ శాఖ భూముల విషయంలో ఎండార్స్‌మెంట్ లేఖ ఇచ్చిన రెవెన్యూ అధికారులకు కనీసం చార్జిమెమో కూడా ఇవ్వలేదు.
కె.కోటపాడు మండలంలో..
కె.కోటపాడు మండలం ఆర్లి గ్రామంలో సర్వే నంబర్లు 84/4, 84/5, 88 సర్వే నంబర్లలో సుమారు 46 ఎకరాల్లో లేవుట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనిలో వీఎంఆర్‌డీఏ నుంచి కేవలం 84/5, 88 సర్వే నంబర్లలో 18 ఎకరాలకు ఎల్‌పీ నంబరు 72/2003/1167తో మాత్రమే అనుమతి ఉందని తెలిసింది. కాగా రియల్ ఎస్టేట్ సంస్థ మాత్రం ఆర్లి గ్రామానికి సంబంధించిన సుమారు 18 ఎకరాల కొండలను, గోర్జలు, గెడ్డలను ఆక్రమించి వెంచర్ అభివృద్ధి పనులు చేస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం ఇక్కడ ఎకరా భూమి రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ధర పలుకుతోంది. స్థానికంగా కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయించి, భూమిని ప్రైవేటు ఆస్తిగా చూపిస్తూ, ప్లాట్లు వేసి విక్రయాలకు సిద్ధం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి ఆక్రమణపై సీపీఎం నాయకులు కలెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు. మీడియాలో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రతి వారం జిల్లాలో మండల రెవెన్యూ కార్యాలయాలకు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు పదుల సంఖ్యలో అందుతున్నాయి. కాగా సంబంధిత మండల రెవెన్యూ అఽధికారులు ఎవరూ ఆ భూముల విషయంలో నోరు విప్పడం లేదు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న అనకాపల్లి మండలంలో ఆక్రమణలపై కూడా అధికారులు కనీసం విచారణ జరిపేందుకు సాహసించడం లేదు.
అనకాపల్లి మండలం మార్టూరులో...
అనకాపల్లి మండలం మార్టూరులో సర్వే నంబర్ 218లో 24 ఎకరాల అప్పలనాయుడు చెరువు ఇటీవల ఆక్రమణలకు గురైనా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎవరూ స్పందించడం లేదు. తుమ్మపాల రెవెన్యూ సత్యనారాయణపురం టిడ్కో ఇళ్లకు సమీపంలో హౌసింగ్ కాలనీకి ఆనుకొని సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక వైసీపీ నేత ఇటీవలే చదును చేయించారు. బోరు కూడా వేయించారు. ఈ భూకబ్జాపై మీడియాలో కథనం వచ్చినా కనీసం విచారణ జరగలేదు. ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. కోడూరు పంచాయతీలో 319 సర్వే నంబరులో జాతీయ రహదారికి సమీపంలో సుమారు 4 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని అనకాపల్లికి చెందిన ఒక వ్యక్తి తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు అందినా విచారణ జరిగిన దాఖలాలు లేవు.
పిసినికాడ పంచాయతీలో...
అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ సర్వే నంబర్లు 353 నుంచి 371 వరకు సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకుడు ఒకరు ఆక్రమించుకొని కొబ్బరి తోట వేశారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. మీడియాలో కథనాలు వెలువడినా కనీసం విచారణకు ఆదేశించలేదు. పైగా కోర్టును ఆఽశ్రయించి తమపై పోరాడాలని భూ ఆక్రమణదారుడికి ఒక రెవెన్యూ అధికారి సలహా ఇచ్చినట్టు తెలిసింది.
కొత్తూరు పంచాయతీలో...
అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో జిల్లా గ్రంథాలయ కార్యాలయానికి ఆనుకొని 674/10, 11 సర్వే నంబర్లలో సుమారు 15 సెంట్ల ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి సమీపంలోని జిరాయితీ భూమి సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో గోడ కట్టేశారు. దీనిపై ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకొని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు.