Share News

భూ విలువ పరిమితంగానే పెంపు

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:39 AM

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్‌ విలువను పెంచాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.

భూ విలువ పరిమితంగానే పెంపు
చోడవరం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం

సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నిర్ణయం

ప్రధాన రహదారుల పక్కన, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసే గ్రామాలకే పరిమితం

చోడవరం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల ఒకటో తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్‌ విలువను పెంచాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ప్రధాన రహదారులను ఆనుకొని, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు అధికంగా వేస్తున్న గ్రామాలకే పెంపుదలను పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో పక్కా వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్‌ విలువ అంతగా పెరగకపోవచ్చని అంటున్నారు. గతంలో మాదిరిగా భూముల విలువను అన్ని గ్రామాల్లో ఒకే విధంగా పెంచకుండా, కేవలం క్రయవిక్రయాలు అధికంగా జరిగే గ్రామాలు, మండల కేంద్రాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు, రియల్‌ వ్యాపారం జరిగే ప్రాంతాలు, లేఅవుట్లు ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేస్తారని అధికారవర్గాల సమాచారం. గత ఏడాది అన్ని రగ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ విలువను పెంచినందున ఈ సారి కేవలం భూములకు గిరాకీ ఉన్న ప్రాంతాలకే పెంపుదలను వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అధికారులు సైతం ఈ దిశగానే కసరత్తు పూర్తి చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం.

చోడవరం, మాడుగుల, కె.కోటపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో అన్ని గ్రామాల్లో ఒకేతరహాలో భూముల రిజిస్ర్టేషన్‌ విలువ పెంచకుండా, ప్రధాన రహదారుల పక్కన, గత ఏడాది కాలంలో అధిక సంఖ్యలో భూముల క్రయవిక్రయాలు జరిగిన గ్రామాల్లోనే పెంచనున్నట్టు అధికారవర్గాల సమాచారం. భూముల క్రయవిక్రయాలు అంతగా జరగని గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ విలువను పెంచినా పెద్దగా ప్రయోజనం వుందని ప్రభుత్వం భావించింది. దీంతో ఏయే గ్రామాల్లో ఎంతెంత చొప్పున భూముల రిజిస్ర్టేషన్‌ విలువను పెంచాలో ఇప్పటికే అధికారులు జాబితాను రూపొందించారు. చోడవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 136 గ్రామాలు ఉండగా, ఇందుల్లో 48 గ్రామాల్లో మాత్రమే భూముల రిజిస్ర్టేషన్‌ విలువను పెంచనున్నట్టు చెబుతున్నారు.

పెరిగిన రిజిస్ట్రేషన్లు

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్‌ విలువను ప్రభుత్వం పెంచనుండడంతో గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. భూముల విలువ పెంపునకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉండడంతో ఈలోగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే కొంతమేర ఆర్థిక భారం తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు. దీంతో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు సందడిగా మారాయి.

Updated Date - Jan 24 , 2026 | 12:39 AM