Share News

భూ విలువ పెంపు!?

ABN , Publish Date - Jan 22 , 2026 | 01:10 AM

భూముల విలువలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. సరిగ్గా ఏడాది క్రితం భూముల విలువలు సవరించింది. మళ్లీ ఇప్పుడు పెంచాలని ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. సగటు ఉద్యోగి సిటీకి పది కిలోమీటర్ల పరిధిలో వంద గజాల స్థలం కొని ఇల్లు కట్టుకోలేని విధంగా ధరలు ఉన్నాయి.

భూ విలువ పెంపు!?

ఆకస్మికంగా ఆదేశాలు

ఫిబ్రవరి 1 నుంచే అమలు చేయాలని ఉత్తర్వులు

కసరత్తుకు కేవలం వారం రోజుల సమయమే

ఇప్పటికే నగరంలో భారీగా ధరలు

గజానికి ప్రభుత్వం రూ.వెయ్యి పెంచితే అంతకు రెట్టింపు పెంచుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు

విశాఖపట్నం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి):

భూముల విలువలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. సరిగ్గా ఏడాది క్రితం భూముల విలువలు సవరించింది. మళ్లీ ఇప్పుడు పెంచాలని ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. సగటు ఉద్యోగి సిటీకి పది కిలోమీటర్ల పరిధిలో వంద గజాల స్థలం కొని ఇల్లు కట్టుకోలేని విధంగా ధరలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ధరలు పెంచితే పరిస్థితి ఏమిటని మధ్య తరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చదరపు గజానికి రూ.5 వేలు పెంచితే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అంతకు రెండింతలు పెంచేస్తున్నారు. ఈ ధరలపై నియంత్రణ లేదు. ఈ ఏడాదికి బాదుడు లేకుండా చూడాలని, తప్పదనుకుంటే స్వల్ప మొత్తాలతో సరిపెట్టాలని చాలామంది కోరుతున్నారు.

వారం రోజుల్లో ఎలా?

గతంలో భూముల విలువలు సవరించాలంటే రెండు నెలల ముందు నుంచి కసరత్తు జరిగేది. సబ్‌ రిజిస్ట్రార్లు వారి పరిధిలోని ప్రాంతాల్లో తిరిగి ఎక్కడెక్కడ నిర్మాణాలు, లేఅవుట్లు వచ్చాయో చూసుకొని, అక్కడి రేట్లు కనుక్కొని, రిజిస్ర్టేషన్‌ విలువ, మార్కెట్‌ రేటు మధ్య ఉన్న తేడా చూసి...ఎంత పెంచవచ్చునో సూచించేవారు. దానిపై జిల్లా రిజిస్ట్రార్‌ ఓసారి, డీఐజీ ఓసారి సమీక్షించిన తరువాత అంతా కలిసి జాయింట్‌ కలెక్టర్‌కు నివేదించేవారు. అక్కడ కూడా చర్చించుకుని సవరణలు చేసి మళ్లీ నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపేవారు. విమర్శలు రాకుండా ఆచితూచి ధరలు పెంచేవారు. ఇప్పుడు అంత కసరత్తు చేయడానికి ప్రభుత్వం సమయం ఇవ్వలేదు. ఫిబ్రవరి ఒకటి నుంచే రేట్లు పెంచాలని ఆదేశించింది. దాంతో ఏమి చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్‌ కలిసి సబ్‌ రిజిస్ర్టార్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. గతంలో ఎక్కడెక్కడ సవరించలేదో...ఆయా ప్రాంతాలను పరిశీలించి ఏ మేరకు పెంచాలో నివేదించాలని సూచించారు. ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వ ప్రాజెక్టుల వల్ల ఏయే ప్రాంతాల్లో భూములకు డిమాండ్‌ పెరిగిందో చూసుకొని, అక్కడ మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా పెంచాలని ఆదేశించారు. ఇప్పటికే ఎక్కువ ధరలు ఉన్నాయని భావిస్తున్న ప్రాంతాల్లో సమత్యులత పాటించాలని సూచించారు.

గత ఏడాది పెంచిన ధరలు

- అడవివరం సింహగిరి కాలనీలో గజం ప్రభుత్వ ధరరూ.20 వేలు ఉండగా, రూ.23 వేలు చేశారు.

- నాయుడుతోటలో గజం రూ.24 వేలు కాగా రూ.27 వేలకు పెంచారు.

- పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం ఎదురుగా ఎంవీవీ సిటీ ప్రాంతంలో గజం స్థలం రూ.40 వేలు ఉండగా, రూ.44 వేలు చేశారు.

- మధురవాడ వుడా రెవెన్యూ లేఅవుట్‌లో గజం ధర రూ.45 వేలు కాగా రూ.55 వేలు చేశారు.

- చంద్రపాలెంలో గజం ధర రూ.30 వేలు కాగా రూ.33 వేలకు పెంచారు.

- బక్కన్నపాలెంలో గజం రూ.20 వేలు కాగా రూ.24 వేలు చేశారు.

- కొమ్మాదిలో గజం రూ.18 వేలు కాగా రూ.21 వేలకు పెంచారు.

- పెదరుషికొండలో గజం రూ.22 వేలు కాగా రూ.30 వేలు చేశారు.

Updated Date - Jan 22 , 2026 | 01:10 AM