Share News

మందకొడిగా భూముల రీసర్వే

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:41 AM

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. రైతుల భాగస్వామ్యంతో భూముల రీసర్వే చేపట్టి, పక్కాగా రికార్డులు తయారుచేసి, పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

మందకొడిగా భూముల రీసర్వే
అచ్యుతాపురం మండలంలో రీసర్వే చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

షెడ్యూల్‌ మేరకు గ్రామాల్లో రీసర్వే చేయని సిబ్బంది

మూడు వారాల నుంచి జేసీ ఛాంబర్‌ ఖాళీ

పక్షం రోజులైనా బాధ్యతలు చేపట్టని కొత్త జాయింట్‌ కలెక్టర్‌

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. రైతుల భాగస్వామ్యంతో భూముల రీసర్వే చేపట్టి, పక్కాగా రికార్డులు తయారుచేసి, పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ క్షేత్రస్థాయిలో ఈ విధంగా జరగడం లేదు. జిలాలో 733 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటి వరకు మూడు దశల్లో 474 గ్రామాల్లో రీసర్వే చేశారు. సుమారు 2.1 లక్షల మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఇంకా 259 గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది. ఈ నెల 2వ తేదీ నుంచి నాలుగో దశ రీసర్వే నిర్వహిస్తున్నారు. కాగా రీసర్వే కోసం 3,18,094 అర్జీలు అందగా వీటిలో 2,51,957 అర్జీలను అధికారులు రీసర్వే ద్వారా పరిశీలన పూర్తి చేశారు. ఇంకా 66,137 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. రీసర్వేపై నిత్యం పదుల సంఖ్యలో అభ్యంతర దరఖాస్తులు మండల రెవెన్యూ కార్యాలయాలకు అందుతూనే ఉన్నాయి.

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

వాస్తవానికి జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో రీసర్వే జరగాలి. అయితే జాహ్నవి కొద్ది రోజులు క్రితం దీర్ఘకాల సెలవులో వెళ్లిపోయారు. దీంతో రీసర్వే ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. సంక్రాంతి పండుగకు ముందు సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన భూపరిపాలన విభాగం అధికారుల సమీక్షా సమావేశంలో భూముల రీసర్వేలో అనకాపల్లి జిల్లా వెనుకబడి వుండడాన్ని గుర్తించారు. అప్పటికే జేసీ జాహ్నవి సెలవులో వున్నారు. దీంతో వెంటనే కొత్త జేసీని నియమించాలని సీఎం ఆదేశించడంతో సూర్యతేజను నియమిస్తూ సీఎస్‌ విజయానంద్‌ ఈ నెల 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. 19వ తేదీన ఇక్కడ బాధ్యతలు చేపడతారని సంబంధిత అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ ఐదు రోజులైనా ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఆయన ఎప్పుడు వస్తారో జిల్లా అధికారులకు కూడా స్పష్టత లేదు. జేసీ లేని ప్రభావం భూముల రీసర్వేపై పడింది. మండల స్థాయిలో షెడ్యూల్‌ నిర్ణయించుకున్న అధికారులు ఆ మేరకు గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయడం లేదు. కొన్నిచోట్ల సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయని సిబ్బంది అంటున్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:41 AM