Share News

భూదందా ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - Oct 06 , 2026 | 01:12 AM

బతికున్న సీనియర్‌ సిటిజన్‌ చనిపోయినట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించి సుమారు రూ.80 లక్షల విలువైన స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన ముఠాను పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భూదందా ముఠా గుట్టురట్టు

  • ఓ సీనియర్‌ సిటిజన్‌ చనిపోయినట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించి రూ.కోటి స్థలం కాజేసేందుకు ప్లాన్‌

  • తొమ్మిది మంది అరెస్టు

కొమ్మాది, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):

బతికున్న సీనియర్‌ సిటిజన్‌ చనిపోయినట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించి సుమారు రూ.80 లక్షల విలువైన స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన ముఠాను పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి సహా ఎనిమిది మందిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్టు డీసీపీ-1 మణికంఠ చందోలు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గాజువాకకు చెందిన రిటైర్డ్‌ పోర్టు ఉద్యోగి పెన్నాం చంద్రబాబు (70) 2004లో తన భార్య ఉమాదేవి పేరిట మధురవాడ శివశక్తి నగర్‌ సూర్యశక్తి లేఅవుట్‌లో 200 గజాల స్థలం కొనుగోలు చేశారు. 2023లో ఉమాదేవి మృతిచెందారు. ఈ ఏడాది మే నెలలో చంద్రబాబు తన స్థలానికి సంబంధించిన ఈసీ (ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌) తీయించగా, అలమండ కుమార్‌ అనే వ్యక్తి పేరు రావడంతో విస్తుపోయారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఆరా తీయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. చంద్రబాబు 2009లో, ఆయన భార్య 2013లో మృతిచెందినట్టు ఓ ముఠా నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డులు సృష్టించింది. అంతేకాకుండా ఏలూరుకు చెందిన నైనాల కీర్తికను చంద్రబాబు కుమార్తెగా చూపిస్తూ నకిలీ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ తయారుచేసి, ఆమె ద్వారా అలమండ కుమార్‌కు జీపీఏ చేయించింది. బాధితుడు న్యాయం కోసం యత్నించగా లాయర్‌ పప్పల మణికుమార్‌ ఆయనకే ఫోన్‌ చేసి, స్థల యజమాని చనిపోయారని, మీరెవరని తిరిగి ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు జూలై 29న పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు.

రిజిస్ర్టేషన్‌ సమయంలో వలపన్ని పట్టివేత

బాధితుడి ఫిర్యాదు మేరకు విశాఖ నార్త్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ ఎస్‌.అప్పలరాజు, సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ డి.రాము నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సదరు స్థలాన్ని రామా టాకీస్‌ ప్రాంతానికి చెందిన పాలిదాసు ఉష అనే ఆమెకు రూ.80 లక్షలకు విక్రయించేందుకు ముఠా సభ్యులు ఒప్పందం చేసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.15 లక్షలు అడ్వాన్స్‌ తీసుకుని పంచుకున్నారు. శనివారం మధురవాడ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో స్థలం రిజిస్ర్టేషన్‌ చేసి, మిగతా మొత్తాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు మెరుపు దాడి అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టయినవారు...: ప్రధాన సూత్రధారి నక్కెళ్ల రామకృష్ణ శివప్రసాద్‌ (ఎ 1). అతనిపై విశాఖలోని త్రీటౌన్‌, పీఎం పాలెం, కంచరపాలెం, అనకాపల్లి, ఎయిర్‌పోర్ట్‌, ఎంవీపీ స్టేషన్లలో పదమూడుకుపైగా కేసులు ఉన్నాయి. ఏ2..ఆలమండ కుమార్‌. ఇతనిపై దువ్వాడ పీఎస్‌లో అత్యాచారయత్నం కేసు ఉంది. ఇంకా రేగుల గెడ్డ లక్ష్మణరావు (ఎ3), మాతి దుర్గామహేష్‌ (ఎ4), నైనాల కీర్తిక (ఎ5), లాయర్‌ పప్పల మణికుమార్‌ (ఎ7), మంతెన సురేష్‌కుమార్‌రాజు (ఎ8), గోకు సాయికిరణ్‌ (ఎ9) లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు విత్తనాల రత్నప్రసాద్‌ (ఎ6) పరారీలో ఉన్నాడు. వృద్ధులు, నగరంలో లేని భూయజమానుల స్థలాలను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఏసీపీ అప్పలరాజు, సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ రాము, తదితర సిబ్బందిని విశాఖ సీపీ శంఖబ్రతబాగ్చి అభినందించారు. సోమవారం పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీసీపీ-1మణికంఠ చందోలు, ఏసీపీ అప్పలరాజు, పద్మనాభం సీఐ (పీఎంపాలెం ఇన్‌చార్జి) చంద్రమౌళి, ఎస్‌ఐ రాము వివరాలు వెల్లడించారు.

Updated Date - Oct 06 , 2026 | 01:12 AM