శొంఠ్యాంలో ల్యాండ్ పూలింగ్‌కు బ్రేక్
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:49 AM
ఆనందపురం మండలం శొంఠ్యాంలో ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) నిలిచిపోయింది.
ముందే సమాచారం అందడంతో అసైన్డ్ భూములు కలిగిన వారితో నేతల ఒప్పందాలు
ఆక్రమణదారులుగా కొందరు నమోదు
అధికారులు, సిబ్బంది సహకారం
ఆరోపణల నేపథ్యంలో నిలిపివేసిన ప్రభుత్వం
గిడిజాల, గోరింట, కొవ్వాడ, బీడీ పాలెంలలోనే పూలింగ్
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆనందపురం మండలం శొంఠ్యాంలో ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) నిలిచిపోయింది. ఇక్కడ ప్రభుత్వ భూముల్లో రైతులు ఉన్నారని రికార్డులు సృష్టించి, వారి ద్వారా లబ్ధి పొందాలని కొందరు నాయకులు ప్రయత్నాలు చేయడం, వాటిపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
విశాఖపట్నాన్ని గ్రోత్ హబ్ (అభివృద్ధి కేంద్రం)గా మార్చడానికి నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి (వీఎంఆర్‌డీఏ) కోసం 1,941 ఎకరాలు సమీకరించాలని ఏడాది క్రితం నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, వైజాగ్ బే సిటీలను కీలకంగా తీసుకుంది. వైజాగ్ 2.0. పేరుతో విశాఖ నగరాన్ని 210 చ.కి.మీ. మేర విస్తరించాలని ప్రతిపాదనలు రూపొందించింది. 40 చ.కి.మీ.లో బే సిటీని అభివృద్ధికి నిర్ణయించారు. వీటన్నింటికీభూములు అవసరం కావడంతో ల్యాండ్ పూలింగ్‌కు వెళ్లారు. గతంలో వుడా ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు భూములే లేని వారిని తీసుకువచ్చి, అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. దాంతో ఈసారి రెవెన్యూ శాఖనే ల్యాండ్ పూలింగ్ చేసి వీఎంఆర్‌డీఏకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ఎక్కువ భూములు ఉండడంతో అక్కడే సమీకరణకు ముందడుగు వేశారు.
ఆనందపురం మండలం గిడిజాల, దిబ్బడిపాలెం, వేమగిరిపాలెంలలో 309.18 ఎకరాలు, భీమదొరపాలెంలో 122.53 ఎకరాలు, గోరింటలో 198.31 ఎకరాలు, శొంఠ్యాంలో 198.31 ఎకరాలు, పద్మనాభం మండలం కొవ్వాడలో 250.52 ఎకరాలు సమీకరించడానికి గత ఏడాది సెప్టెంబరులో ప్రకటన ఇచ్చారు. ఆయా గ్రామాల్లో అసైన్డ్ భూములు, ఆక్రమిత భూములు, ప్రభుత్వ భూములను గుర్తించి, సమీకరణ జాబితాలో చేర్చారు. ఆయా రైతులు వారి హక్కు పత్రాలను తహశీల్దార్ల కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. వీటిలో శొంఠ్యాం సమీపాన పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని గ్రహించి, అక్కడి భూములపై కొందరు నాయకులు కన్నేశారు. అసైన్డ్ భూముల కొనుగోళ్లకు పావులు కదిపారు. ముందుగానే రైతులతో ఒప్పందాలు చేసుకొని ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు చెల్లించారు. ఇందులో కూటమి నాయకులతో పాటు వైసీపీ నాయకులు కూడా ఉండడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల్లో ఉన్నట్టు తప్పుడు రికార్డులు సృష్టించడంలో మరికొందరు తలమునకలయ్యారు. ఈ వ్యవహారంలో నాయకులతో గ్రామ, మండల స్థాయి రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయినట్టు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. వీటిపై ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాలు ప్రచురించింది. ఈ ఆరోపణలపై విచారించి, తగిన చర్యలు తీసుకోవాలంటూ కూటమి పార్టీకి చెందిన నాయకులు కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌కు లేఖలు సమర్పించారు. వారు తమ ప్రమేయం లేదని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయా భూముల లావాదేవీల్లో నాయకుల ప్రమేయం ఉందని స్పష్టమైన సమాచారం ప్రభుత్వానికి అందడంతో శొంఠ్యాంలో భూసేకరణను తాత్కాలికంగా పక్కనపెట్టింది. మిగిలిన నాలుగు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు.
విజిలెన్స్ విచారణకు ఆదేశం
తేజ్ భరత్, కమిషనర్, వీఎంఆర్‌డీఏ భూములన్నింటినీ రెవెన్యూ అఽధికారులే సమీకరిస్తున్నారు. శొంఠ్యాంపై ఆరోపణలు రావడంతో దానిపై విజిలెన్స్ విచారణ కోరుతూ లేఖ రాశారు. అక్కడ విచారణ జరుగుతోంది. దాంతో ఆ భూములను పక్కనపెట్టి మిగిలిన భూముల అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్నాం.