పేదల పాలిట భూచోళ్లు
ABN , Publish Date - May 02 , 2026 | 11:20 PM
పేదల ఇళ్ల పేరుతో గత వైసీపీ పాలకులు దోచేశారు. ఎందుకూ పనికి రాని భూములను తమ బినామీల నుంచి ప్రభుత్వంతో కొనుగోలు చేయించి కోట్లాది రూపాయలు సంపాదించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల ముసుగులో భారీగా అక్రమాలు
కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను కూడా ప్రైవేటువని చూపించి సర్కారు ఖజానాకు తూట్లు
నివాసయోగ్యంకాని చోట తమ బినామీల నుంచి ప్రభుత్వంతో కొనుగోలు చేయించిన నేతలు
తాజాగా విజిలెన్స్ తనిఖీల్లో అక్రమాలు బట్టబయలు
అక్రమార్కులు, అప్పటి అధికారుల్లో గుబులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
పేదల ఇళ్ల పేరుతో గత వైసీపీ పాలకులు దోచేశారు. ఎందుకూ పనికి రాని భూములను తమ బినామీల నుంచి ప్రభుత్వంతో కొనుగోలు చేయించి కోట్లాది రూపాయలు సంపాదించారు. ఈ అక్రమాలపై విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించడంతో తాజాగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ కుంభకోణాన్ని బహిర్గతం చేశారు.
జిల్లాలో అభ్యంతరకరమైన పోరంబోకు స్థలాలు, వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపి వైసీపీ నాయకులు తమ బినామీలకు ప్రభుత్వ ఖజానా నుంచి అధిక మొత్తంలో చెల్లింపులు జరిపించినట్టు విజిలెన్స్ తనిఖీల బృందం తన నివేదికలో వెల్లడించింది. జిల్లాలో 24 మండలాల పరిధిలో 84 లేఅవుట్లు నివాసయోగ్యం కాని స్థలాల్లో వేసినట్టు గుర్తించారు. ఇందులో 13 లేఅవుట్లు కొండలు, గుట్టల మధ్యలో ఉన్నాయి. ఆయా లేఅవుట్లలో ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోలేదు. జిల్లాలో 624 మంది యజమానుల నుంచి జిరాయితీ భూములను కొనుగోలు చేయగా, అందులో వైసీపీ నాయకులు బినామీల పేర్లతో ఇళ్ల నిర్మాణాల కోసం 336.22 ఎకరాల జిరాయితీ భూమిని ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేయించారు. దీనికి సుమారు రూ.3.91 కోట్లు చెల్లించినప్పటికీ ఆయా భూములు నివాసయోగ్యం కానివే కావడం గమనార్హం. భూముల మార్కెట్ విలువ కంటే అధిక ధరలు చెల్లించినట్టు గుర్తించారు. జిల్లాలో అనకాపల్లి, గొలుగొండ, రావికమతం, చోడవరం, నాతవరం మండలాల్లో ఎందుకు పనికిరాని భూములను కాలనీల కోసమని కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ బృందం తేల్చింది. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో నివాసయోగ్యం కాని సుమారు 2.71 ఎకరాలను వైసీపీ నేతలు కొనుగోలు చేయించి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టినట్టు విజిలెన్స్ తనిఖీల్లో బహిర్గతమైంది. అనకాపల్లి మండలం కోడూరులో 146.58 ఎకరాల్లో లేఅవుట్ వేసినట్టు చెబుతున్నా, ఎవరికీ ప్లాట్‌లు కేటాయించలేదని తేల్చారు. కుంచంగి, కూండ్రం, పాపయ్య సంతపాలెం, గొలగాం, శంకరం పరిసరాల్లో కొండవాలు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ప్రభుత్వానికి చెందిన మెట్ట భూముల్లో లేఅవుట్లు వేశారు. నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల పరిధిలో పలు చోట్ల నివాసయోగ్యం కాని స్థలాలను లేఅవుట్ల కోసం కొనుగోలు చేసి వైసీపీ బినామీలకు భారీగా ప్రభుత్వ సొమ్ము చెల్లించేసినట్టు గుర్తించారు.
విజిలెన్స్ నివేదికతో అక్రమార్కుల్లో వణుకు
పేదలకు ఇళ్ల పేరిట గత వైసీపీ పాలకులు సాగించిన అక్రమ వ్యవహారాలు విజిలెన్స్ నివేదికతో బయట పడడంతో అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూదందాకు పాల్పడిన వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. వారికి సహకరించిన జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ అయినట్టు తెలిసింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉండగా జరిగిన అక్రమాల సమయంలో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా వి.వినయచంద్, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా పి.కోటేశ్వరరావు, నర్సీపట్నం ఆర్డీవోగా కె.ఎల్.శివజ్యోతి, అనకాపల్లి ఆర్డీవోగా జె.సీతారామారావు ఉన్నారు. భూ సేకరణలో జరిగిన అక్రమాలపై అప్పట్లో పనిచేసిన రెవెన్యూ అధికారులే ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో పనిచేసి ప్రస్తుతం వివిధ హోదాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కొందరు పనిచేస్తున్నారు. మరికొందరు రిటైర్ అయ్యారు. అయితే ఏ అధికారి ఎక్కడున్నా, రిటైర్ అయినా విజిలెన్స్ నోటీసులకు సమాధానం చెప్పాల్సి ఉండడంతో గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఆయా అధికారుల్లోనూ అంతర్మథనం మొదలైంది.