పయనీర్‌కు భూముల ధారాదత్తం
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:28 PM
ఎంఎస్‌ఎంఈ(మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) పార్కు కోసమంటూ రైతుల సాగులో ఉన్న 479 ఎకరాల భూములను ఖాళీ చేయించిన రెవెన్యూ అధికారులు దానిని పయనీర్ కంపెనీకి కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది.
కారుచౌకగా 479 ఎకరాలు అప్పగింత
ఎకరా రూ.4 లక్షలు చొప్పున ఇవ్వాలని గత వైసీపీ ప్రభుత్వం జీవో జారీ
తాజాగా ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామంటూ రైతులను ఖాళీ చేయించిన అధికారులు
పది రోజుల క్రితం కంపెనీకి గుట్టుగా రిజిస్ట్రేషన్
ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరా రూ.50 లక్షలు
2007 నాటి ధరకే కట్టబెట్టిన వైనం
మాకవరపాలెం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఎంఎస్‌ఎంఈ(మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) పార్కు కోసమంటూ రైతుల సాగులో ఉన్న 479 ఎకరాల భూములను ఖాళీ చేయించిన రెవెన్యూ అధికారులు దానిని పయనీర్ కంపెనీకి కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎకరా రూ.4 లక్షల చొప్పున పయనీర్ కంపెనీకి ఇవ్వాలని జీవో జారీ చేయగా, కూటమి ప్రభుత్వంలో అదే ధరకు రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరా రూ.50 లక్షలు ఉండగా, 2007 నాటి ధరకే కంపెనీకి కట్టబెట్టడం, రైతులకు పూర్తిగా పరిహారం చెల్లించకుండా ఖాళీ చేయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మండలంలోని రాచపల్లి రెవెన్యూలో 2007 సంవత్సరంలో 2,450 భూమిని అప్పట్లో పయనీర్ కంపెనీ(అల్యూమినియం) తీసుకుంది. 1,800 ఎకరాల్లో సుమారు రూ.5 వేల కోట్లతో కంపెనీ నిర్మాణం చేపట్టి ఉత్పత్తి ప్రారంభించింది. మరో 600 ఎకరాల భూమిని కంపెనీ అవసరాల నిమిత్తం ఖాళీగా ఉంచిది. ఇదే కాకుండా అప్పట్లో రామన్నపాలెం గ్రామానికి అనుకొని 18, 19, 20, 21 బ్లాక్‌ల్లో ఉన్న 305 ఎకరాల భూమిని, అలాగే జి.వెంకటాపురంలో 104 ఎకరాలు, జి.కోడూరులో 70 ఎకరాల భూమిని తీసుకుంది. ఇలా మొత్తం 479 ఎకరాల భూమిని తీసుకుంది తప్ప ఆ భూమిలో కంపెనీ నాటి నుంచి నేటి వరకు ఎటువంటి పనులు ప్రారంభించలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, ఎటువంటి కంచె వేయలేదు. దీంతో అప్పటి నుంచి ఆ భూముల్లో రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిలో కొంత మంది రైతులకు పరిహారం కూడా చెల్లించవలసి ఉంది. 2024లో వైసీపీ ప్రభుత్వం ఎకరా రూ.4 లక్షల చొప్పున ఆ భూములు పయనీర్ కంపెనీకి ఇవ్వాలని జీవో విడుదల చేసింది. వాస్తవానికి 2007లో నిర్ణయించిన ధర ఇది. దీంతో రైతులు ఆందోళన చెందారు. 2025లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న భూమి ఎంత ఉందని జిల్లా అధికారులు ఆరా తీశారు. దీంతో రామన్నపాలెం గ్రామానికి ఆనుకొని 305 ఎకరాల భూమి ఉందని, దానిలో ఎంఎస్‌ఎన్‌ఈ పార్కు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో నెల రోజుల పాటు కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులు పరిశీలించి, ఆ భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగులో ఉన్న భూమిని ఖాళీ చేయాలని రైతులకు స్థానిక రెవెన్యూ అధికారులు తెలిపారు. సాగు భూమిలో ఉన్న రైతులను తొలగించేందుకు కొందరు స్థానిక కూటమి నాయకులు బాధ్యత తీసుకున్నారు. ఖాళీ చేయించిన తరువాత అసలు కథ మొదలైంది. ఈ భూమితో కలిపి మొత్తం 479 ఎకరాలను గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగా ఎకరా రూ.4 లక్షల చొప్పున పయనీర్ కంపెనీకి పది రోజుల క్రితం ఏపీఐఐసీ అధికారులు రిజిస్ర్టేషన్ చేశారు. వాస్తవానికి మార్కెట్ విలువ ఎకరా సుమారు రూ.50 లక్షలు ఉంది. అయితే రూ.4 లక్షల చొప్పున కంపెనీకి కట్టబెట్టి కోట్లాది రూపాయలు మేలు చేకూర్చారని పలువురు విమర్శిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కంపెనీకే మేలు జరిగిందని రైతులు వాపోతున్నారు. దీనిపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నర్సింహరావును వివరణ కోరగా 479 ఎకరాల భూములకు గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, దాని ప్రకారం పది రోజులు క్రితం ఆ భూములను పయనీర్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆయన తెలిపారు.