Share News

దర్జాగా భూ కబ్జా

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:13 AM

అనకాపల్లి మండలం పిసినికాడ రెవెన్యూ పరిధిలో ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు రహదారి కోసం ప్రభుత్వ భూమి కబ్జా చేసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీని వెనుక జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ పరిధిలోని ఒక కార్పొరేటర్‌ భర్త వున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు కోటి రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.

దర్జాగా భూ కబ్జా
: ప్రభుత్వ స్థలంలో నుంచి ప్రైవేటు లే అవుట్‌కు రహదారి వేస్తున్న దృశ్యం

పిసినికాడలో రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌కు రోడ్డు నిర్మాణం

25 సెంట్లు మేర ఆక్రమణ

మార్కెట్‌ విలువ ప్రకారం రూ.కోటిపైనా..

కొత్తూరు, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం పిసినికాడ రెవెన్యూ పరిధిలో ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు రహదారి కోసం ప్రభుత్వ భూమి కబ్జా చేసి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీని వెనుక జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ పరిధిలోని ఒక కార్పొరేటర్‌ భర్త వున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు కోటి రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.

పిసినికాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 38/1, 38/2లలో 8.36 ఎకరాల భూమిలో లేఅవుట్‌ వేసేందుకు వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడు (ఇతని తల్లి అప్పట్లో ప్రజాప్రతినిధిగా వున్నారు) వీఎంఆర్‌డీఏకు దరఖాస్తు చేశారు. కానీ ఈ భూమిలోకి వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో మధ్యలో సర్వే నంబరు 43లో వున్న ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో రహదారిగా చూపించి, అనుమతులు తెచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అనకాపల్లి పట్టణ పోలీసులకు, రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ అధికారులకు ఫిర్యాదులు చేశారు. తరువాత వైసీపీ అధికారాన్ని కోల్పోవడం, కూటమి అధికారంలోకి రావడంతో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ పనులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో వెంచర్‌ వేసిన సదరు నాయకుడు.. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్‌ భర్తను ఆశ్రయించి, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు రోడ్డు సదుపాయం కల్పిస్తే.. కొంత వాటా ఇస్తానని ఆఫర్‌ చేసినట్టు తెలిసింది. దీంతో సదరు కార్పొరేటర్‌ భర్త ఇందుకు అంగీకరించి సర్వే నంబరు 43లో ఉన్న 70 సెంట్ల ప్రభుత్వ స్థలంలో 25 సెంట్లు ఆక్రమించి, మూడు రోజుల నుంచి గ్రావెల్‌తో రహదారి నిర్మాణం చేయిస్తున్నారు. దీంతో స్థానికులు మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు నిర్మాణాన్ని ఎవరైనా అడ్డుకుంటే సహించేది లేదని కార్పొరేటర్‌ భర్త హెచ్చరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షలు పలుకుతున్నదని, ఆక్రమించిన ప్రభుత్వ స్థలం విలువ కోటి రూపాయలకుపైగా వుంటుందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాకుండా రోడ్డు నిర్మాణం చేపట్టిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Nov 25 , 2026 | 01:13 AM