చింతగట్లలో కబ్జాదారుల వీరంగం
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:07 AM
ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై ప్రైవేటు వ్యక్తులు భౌతిక దాడికి యత్నించారు. కర్రలు, రాళ్లతో వీరంగం సృష్టించారు.
ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడికి యత్నం
ఎక్స్‌కవేటర్‌పై రాళ్లు రువ్విన వైనం
పోలీసులకు బాధిత వీఆర్వో ఫిర్యాదు
పెందుర్తి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై ప్రైవేటు వ్యక్తులు భౌతిక దాడికి యత్నించారు. కర్రలు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ ఘటన పెందుర్తి మండలం చింతగట్లలో శనివారం జరిగింది. ఇందుకు సంబంధించి బాధిత వీఆర్వో నాగహనుమాన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతగట్లలోని సర్వే నంబరు 57లో పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొంతమేర పేదల ఇళ్ల నిర్మాణానికి వినియోగించారు. మరికొంత రైతులకు ఇచ్చారు. ఇంకా కొంత ఉంది. ఆ భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు కొంతమేర ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారు. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆక్రమణలు తొలగించాలన్న తహశీల్దార్ వెంకట అప్పారావు ఆదేశాలతో శనివారం చింతగట్ల వీఆర్వో నాగహనుమంతు, ఆయనకు సహాయకారిగా మరో వీఆర్వో ధర్మ, రెవెన్యూ సిబ్బంది ఎక్స్‌కవేటర్‌తో ఆక్రమిత స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధపడుతుండగా ఒకే కుటుంబానికి చెందిన మహిళతో సహా ఇద్దరు అక్కడకు వచ్చి అడ్డుకున్నారు. రాళ్లు రువ్వి ఎక్స్‌కవేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆక్రమణలు తొలగించకుండానే సిబ్బంది వెనుతిరిగారు. అనంతరం తనపై చీపురపల్లి నరసింగరావు, ఆయన భార్య చిన్ని, కుమారుడు రాజేశ్‌లు భౌతిక దాడికి ప్రయత్నం చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు వీఆర్వో హనుమంతు ఫిర్యాదు చేశారు. వీఆర్వో నుంచి అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్‌ఐ స్వామినాయుడు తెలిపారు. కాగా రెవెన్యూ సిబ్బంది విధులకు అడ్డుపడిన వ్యక్తి టీడీపీ కార్యకర్త అని స్థానికంగా ప్రచారం జరుగుతుంది.