ఐటీ కంపెనీలకు భూములు
ABN , Publish Date - Apr 18 , 2026 | 01:09 AM
పలు ఐటీ కంపెనీలకు విశాఖపట్నం జిల్లాలో భూములు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఫ్యుజిక సాఫ్ట్‌వేర్ కంపెనీకి కాపులుప్పాడ ఐటీ పార్కులో 2 ఎకరాలు
ఐస్ర్పౌట్ సంస్థకు 9.5 ఎకరాలు
శ్రీటెక్ డేటా లిమిటెడ్ సంస్థకు కాపులుప్పాడలో 40 సెంట్లు
ప్రభుత్వం ఉత్తర్వులు
రూ.368.88 కోట్ల పెట్టుబడి పెట్టనున్న క్రెడెన్స్ రియాల్టీ సంస్థ
భూమి ఎక్కడ కేటాయించారో పేర్కొనకుండా తగిన వసతులు కల్పించాల్సిందిగా ఆదేశాలు
గూగుల్ డేటా సెంటర్ నిర్మించే అదానీకి అన్నింటా మినహాయింపులు
విశాఖపట్నం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి):
పలు ఐటీ కంపెనీలకు విశాఖపట్నం జిల్లాలో భూములు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ కేటాయింపులు చేసింది. క్రెడెన్స్ రియాల్టీ సంస్థకు ఐటీ పార్క్ ఏర్పాటు చేయడానికి ఎక్కడ ఎంత భూమి కేటాయించారో వివరాలు పేర్కొనకుండా రూ.368.88 కోట్లు పెట్టుబడి పెడుతుందని, 6,500 మందికి ఉద్యోగాలు ఇస్తుందని పేర్కొంది. వారికి కేటారుంచే భూమికి జాతీయ రహదారి నుంచి ప్రవేశం, నిష్క్రమణకు ఏర్పాట్లు చేయాలని నేషనల్ హైవే అథారిటీని ఆదేశించింది. సర్వీస్ రహదారిని ఏడు మీటర్ల నుంచి 18 మీటర్లకు విస్తరించాలని వీఎంఆర్‌డీఏకి సూచించింది. ఆ భూమి ఎక్కడనేది మాత్రం పేర్కొనలేదు.
- ఫ్యుజిక సాఫ్ట్‌వేర్ కంపెనీకి కాపులుప్పాడ ఐటీ పార్కులో రెండు ఎకరాలు కేటాయించారు. ఎకరాకు రూ.4 కోట్ల ధర నిర్ణయించారు. వీరు మొత్తం రూ.425 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తారు. తొలి దశలో రూ.213.87 కోట్లు పెట్టుబడి పెడతారు. వీరు రెండేళ్లలో వేయి మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధన పెట్టారు.
- ఐస్ర్పౌట్ సంస్థకు బిజినెస్ సెంటర్ , ఐటీ కో వర్కింగ్ స్పేస్ కోసం రెసిడెన్షియల్, ఆతిథ్య రంగం, వాణిజ్య అవసరాల నిమిత్తం 9.5 ఎకరాలు కేటాయించారు. అందులో 3.5 ఎకరాలు మధురవాడలో ఎకరా రూ.15 కోట్లు చొప్పున, కాపులుప్పాడలో ఆరు ఎకరాలు ఎకరా కోటి రూపాయలు చొప్పున ఇచ్చారు. వీరు రూ.629.9 కోట్ల పెట్టుబడి పెట్టి 12,500 మందికి ఉద్యోగాలు ఇస్తారు.
- శ్రీటెక్ డేటా లిమిటెడ్ సంస్థ కేబుల్ ల్యాండింగ్ సెంటర్ కోసం 1.28 ఎకరాలు కోరగా కాపులుప్పాడలో 40 సెంట్లు కేటాయించారు. ఎకరా ధర రూ.1.5 కోట్లుగా నిర్ణయించారు.వీరు రూ1,800 కోట్లు పెట్టుబడి పెడతారు. డేటా సెంటర్లు, కేబుల్ ల్యాండింగ్ సెంటర్ల ద్వారా పెద్దగా ఉద్యోగాలు రానందున ఉపాధి ఎంతమందికి అనేది వెల్లడించలేదు.
కోరినవన్నీ అదానీకి...
గూగుల్ డేటా సెంటర్ తరపున అదానీ ఇన్‌ఫ్రా నిర్మాణ పనులన్నీ చేపడుతుండడంతో ఆ సంస్థ అడిగిన మినహాయింపులన్నీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో కేటాయించిన 601 ఎకరాలకు ఏపీఐఐసీ లీజ్ డీడ్ రాయగా, దాన్ని అదానీ కోర్కె మేరకు సేల్ డీడ్‌గా మార్చారు. వాటిపై హక్కులన్నీ అదానీకే ఉంటాయి. ఇవికాకుండా డేటా సెంటర్ల నిర్మాణంలో తాము బఫర్ జోన్ ఉంచబోమని చెప్పగా దానికి కూడా ఓకే చేశారు. ఈ సెంటర్లకు సమీపంలో ఉన్న కంబాలకొండ అభయారణ్యం నుంచి, రాంబిల్లిలో నేవీ న్యూక్లియర్ సబ్‌మెరైన్ స్థావరం నుంచి నిరభ్యంతర పత్రాలు ఇవ్వడానికి అంగీకరించింది. ఎవరికైనా నిర్మాణాలు పూర్తయిన తరువాత సర్టిఫికెట్లు ఇస్తారు. వీరికి మాత్రం కొంత పూర్తిచేసినా సర్టిఫికెట్లు ఇవ్వడానికి అంగీకరించారు. ప్రహరీ గోడ ఎత్తు సాధారణంగా మీటరు ఎత్తు ఉంటుంది. వీరు 3.6 మీటర్లు పెడతామంటే దానికీ ఓకే చేశారు. ఫ్లోర్ నుంచి సీలింగ్ ఎంత ఎత్తులో ఉండాలనే దానిపై నిర్మాణం బట్టి ఆంక్షలు ఉంటాయి. కానీ తమకు అవి వర్తించకుండా చూడాలని కోరగా..దానికీ అంగీకరించారు. ప్రతి భవనానికి పార్కింగ్ నిబంధనలు ఉంటాయి. అదానీ సంస్థ వాటి నుంచి మినహాయింపు కోరగా దానికీ ఆమోదం తెలిపారు.