Share News

‘మాకవరపాలెం’లో ల్యాండ్‌ బ్యాంకు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:47 AM

మాకవరపాలెం మండలాన్ని పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఎంఎస్‌ఎంఈ పార్కును మంజూరు చేసి భూములు కేటాయించింది. ప్రైవేటు రంగంలో ఎర్త్‌ మూవర్స్‌ కంపెనీ ‘డోక్సో’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ అధికారులు కొద్ది రోజుల నుంచి పలు గ్రామాల్లో సర్వే జరుపుతున్నారు.

‘మాకవరపాలెం’లో ల్యాండ్‌ బ్యాంకు
పైడిపాలలో అధికారులు సర్వే చేసిన భూములు ఇవే

ప్రభుత్వ, డి.పట్టా భూములను గుర్తించాలని ప్రభుత్వ ఆదేశాలు

నాలుగు గ్రామాల్లో ఐదు వేల ఎకరాల కోసం సర్వే

మాకవరపాలెం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మాకవరపాలెం మండలాన్ని పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఎంఎస్‌ఎంఈ పార్కును మంజూరు చేసి భూములు కేటాయించింది. ప్రైవేటు రంగంలో ఎర్త్‌ మూవర్స్‌ కంపెనీ ‘డోక్సో’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ అధికారులు కొద్ది రోజుల నుంచి పలు గ్రామాల్లో సర్వే జరుపుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ల్యాండ్‌ బ్యాంకు కింద ప్రభుత్వ భూములతోపాటు డి.పట్టా భూములను గుర్తించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాకవరపాలెం మండలంలో సుమారు ఐదు వేల ఎకరాలను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమై వున్నారు. మండలంలో పైడిపాల, పెద్దిపాలెం, పాపయ్యపాలెం, బూరుగుపాలెం గ్రామాల్లో గత వారం రోజుల నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. పైడిపాల, పెద్దిపాలెం గ్రామాల్లో సుమారు 2,100 ఎకరాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదించారు. మిగిలిన గ్రామాల్లో సర్వే కొనసాగుతున్నది.

ఇదిలావుండగా స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నియోజవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనివల్ల స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి. ఇందులో భాగంగా మండలంలోని రాచపల్లి 737 సర్వే నంబరులో 410 ఎకరాల్లో ఎర్త్‌ మూవర్స్‌ కంపెనీ డోజ్కోతోపాటు ఫుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు కానున్నాయి. శెట్టిపాలెంలో కాఫీపొడి తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతోపాటు శంకుస్ధాపన కూడా చేసింది. 2007లో రామన్నపాలెం వద్ద ఏపీఐఐసీ వారు తీసుకున్న 290 ఎకరాల్లో కూడా పలు పరిశ్రమలు వస్తాయని అంటున్నారు. ప్రభుత్వ, డి.పట్టా భూములు అధికంగా వుండడం, జాతీయ రహదారికి సమీపంలో వుండడంతో మాకరవపాలెంలో రానున్న కాలంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:47 AM