Share News

ఆదాయానికి భూముల సపోర్టు

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:23 AM

విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంటు తరువాత అత్యధిక భూములు కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థగా పోర్టుకు పేరుంది.

ఆదాయానికి భూముల సపోర్టు

భూ నిర్వహణ పాలసీ విస్తరణ

పోర్టుకు 7,618 ఎకరాలు

దీర్ఘకాలిక లీజుకు 3,554 ఎకరాలు

ఖాళీగా మరో 590 ఎకరాలు

అవి కూడా నిబంధనల ప్రకారం కేటాయించేందుకు నిర్ణయం

నిరర్థకంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంటు తరువాత అత్యధిక భూములు కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థగా పోర్టుకు పేరుంది. అనేక ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వందలాది ఎకరాలను ఆదాయ వనరుగా మార్చాలని కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ ఒక పాలసీని తీసుకువచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం విశాఖపట్నం పోర్టు ప్రత్యేక ప్రణాళిక ద్వారా వాటిని సద్వినియోగం చేస్తోంది. ఏవీ నిరర్థక భూములుగా ఉండకూడదని యత్నిస్తోంది.

విశాఖపట్నం పోర్టు వద్ద మొత్తం 7,618 ఎకరాలు ఉన్నాయి. వాటిలో పోర్టు నిర్వహణ, మౌలిక వసతుల కోసం 1,502 ఎకరాలు ఉపయోగించుకుంటోంది. దీర్ఘకాలిక లీజు కింద వివిధ సంస్థలకు 3,554 ఎకరాలను కేటాయించింది. స్వల్పకాలిక లీజు కింద మరో 401.85 ఎకరాలను వివిధ కంపెనీలకు అప్పగించింది. పోర్టు ద్వారా కాలుష్యం అధికంగా వస్తున్నదనే విమర్శల నేపథ్యంలో సుమారు 870 ఎకరాల్లో గ్రీన్‌ బెల్ట్‌ నిర్వహిస్తోంది. పోర్టుకు దఖలు పడిన భూముల్లోని 695 ఎకరాల్లో కొండలు ఉన్నాయి. అన్నీ పోను పోర్టు వద్ద ఇంకా 590 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకువస్తే పరిశీలించి, కేంద్ర మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపి వాటిని కూడా కేటాయిస్తామని పోర్టు సెక్రటరీ శంకర్‌బాబు వెల్లడించారు. ఉపయోగంలో లేని భూముల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడమే ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ ఉద్దేశమని చెప్పారు.

ఐదేళ్లకు పాలసీ...మరింత విస్తరణ

ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీని తొలుత 2015-2020 ఆర్థిక సంవత్సరాలకు రూపొందించారు. ఆ తరువాత పోర్టుల వద్ద ఉన్న భూములను ఆఽధారంగా చేసుకొని దాన్ని విస్తరించారు. కొత్తగా రూపొందించుకున్న 2026 పాలసీ ప్రకారం పోర్టు ఆధునికీకరణ, సరకుల హ్యాండ్లింగ్‌ కోసం, పోర్టు కనెక్టివిటీ కోసం, టెర్మినళ్ల సామర్థ్యం పెంపునకు ఈ భూములను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కార్గో ఆపరేషన్లు, లాజిస్టిక్స్‌, ఆదాయం పెంచుకోవడానికి వినియోగించుకోవచ్చు.

ఇటీవల కాలంలో భూముల వినియోగానికి సంబంధించి పోర్టు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ను మార్చింది. గ్రీన్‌ బెల్ట్‌ ఏరియాగా గుర్తించిన కొన్ని భూములను పోర్టుకు సంబంధం లేని పనులకు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.

- విశాఖపట్నం విమానాశ్రయానికి పశ్చిమంగా ఉన్న 13 ఎకరాలను గ్రీన్‌ బెల్ట్‌ నుంచి తప్పించింది. అదేవిధంగా విమానాశ్రయం వద్ద గెయిల్‌ సంస్థకు ఎదురుగా ఉన్న 13.79 ఎకరాలను గ్రీన్‌ బెల్ట్‌ నుంచి మినహాయించింది. ఐపీఎల్‌ గొడౌన్‌కు ఉత్తరాన ఉన్న 6.06 ఎకరాలను గ్రీన్‌ బెల్డ్‌ నుంచి పక్కన పెట్టింది. అదే పరిసరాల్లో 8.17 ఎకరాల విస్తీర్ణం కలిగిన మరో రెండు ల్యాండ్‌ పార్శిళ్లను మినహాయించింది.

హిల్‌, బ్రౌన్‌ జోన్‌ నుంచి మార్పు

కొండలు, నీటి ప్రవాహాలు, ట్రక్‌ పార్కింగ్‌ వంటి కోసం వినియోగిస్తున్న 199.35 ఎకరాలను పోర్టు వ్యాపారానికి సంబంధం లేని పనులకు వాడుకునేందుకు వీలుగా మార్పు చేసింది. ఇందులో డాల్ఫిన్స్‌ నోస్‌ ఏరియాను ఆనుకొని నాలుగు ల్యాండ్‌ పార్శిళ్లలో 154 ఎకరాలు ఉంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు కేటాయించిన 17,90 ఎకరాలను కూడా బ్రౌన్‌ జోన్‌ నుంచి మార్చింది.

Updated Date - Nov 10 , 2026 | 01:24 AM