గూగుల్‌కు భూసేకరణ పూర్తి
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:26 AM
ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ మంగళవారంతో పూర్తయింది. ఇప్పటివరకు భూమి ఇవ్వని దివ్యాంగుడైన రైతు గణేశ్ కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మంగళవారం తన అంగీకార పత్రాలను మండల రెవెన్యూ అధికారులకు సమర్పించారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌కు భూసేకరణ మంగళవారంతో పూర్తయింది. ఇప్పటివరకు భూమి ఇవ్వని దివ్యాంగుడైన రైతు గణేశ్ కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మంగళవారం తన అంగీకార పత్రాలను మండల రెవెన్యూ అధికారులకు సమర్పించారు. దీనికి ముందు ఆయన భీమిలి బాలికల గురుకుల పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావును కలిసి ప్రభుత్వం నుంచి తనకు అదనంగా పరిహారం ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకున్న 1.94 ఎకరాల భూమిని గూగుల్ కంపెనీ కోసం ఇస్తున్నట్టు పత్రాలు ఎమ్మెల్యేకు చూపించారు. వాటిని మండల రెవెన్యూ అధికారులకు వెంటనే ఇవ్వాలని సూచించగా కుటుంబంతో సహా వెళ్లి ఆనందపురం తహసీల్దార్‌కు అందజేశారు. తర్లువాడలో ప్రభుత్వం గూగుల్ కోసం మొత్తం 308 ఎకరాలు సేకరించినట్టయింది. తహసీల్దార్ శ్రీనుబాబు మాట్లాడుతూ, దీంతో భూసేకరణ పూర్తయిందన్నారు.
వైసీపీ కుట్రకు చెక్
గూగుల్‌కు రైతులు భూములు ఇవ్వకుండా చేసేందుకు వైసీపీ నాయకులు కుట్రలకు దిగారు. బినామీలను రంగంలో దించి ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తం ఇస్తామని వారికి ఆశ పెట్టారు. దీంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌లు తర్లువాడ వెళ్లి ఎకరా ప్రభుత్వ ధర రూ.17 లక్షలు ఉండగా దానిని పరిహారం కోసం రూ.20 లక్షలు చేశారు. ఇంటికో ఉద్యోగం, ఉపాధి కోసం వాణిజ్య సముదాయంలో షాపు, 520 మంది రైతులకు మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు, ఇప్పించారు. దీంతో తర్లువాడ మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు మజ్టి వెంకటరావు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆఖరి రైతు కూడా భూమి ఇవ్వడంతో వైసీపీ కుట్రకు చెక్ చెప్పినట్టయిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.