Share News

పిక్నిక్‌లకు లంబసింగి పిలుస్తోంది

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:46 PM

కార్తీకమాసంలో వనభోజనాలను ఆచరించేందుకు ప్రకృతి ప్రేమికులను ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి పిలుస్తోంది.

పిక్నిక్‌లకు లంబసింగి పిలుస్తోంది
కృష్ణాపురం అటవీశాఖ నిర్వాహణలోనున్న పైనరీ ప్రధాన ద్వారం

కార్తీక వనభోజనాలకు ప్రకృతి అందాల ఆహ్వానం

తాజంగి జలాశయం, యర్రవరం జలపాతం, కృష్ణాపురం పైనరీ అనువైన ప్రాంతం

ఆసక్తి చూపుతున్న సందర్శకులు

చింతపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

కార్తీకమాసంలో వనభోజనాలను ఆచరించేందుకు ప్రకృతి ప్రేమికులను ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి పిలుస్తోంది. ఏటా వేల సంఖ్యలో సందర్శకులు పిక్నిక్‌లకు ఇక్కడకు వస్తుంటారు. ఈ సీజన్‌లో లంబసింగిలో ప్రకృతి అందాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడకు సమీపంలోనున్న తాజంగి జలాశయం, కృష్ణాపురం పైనరీ, యర్రవరం జలపాతాల్లో వనభోజనాలకు అనువైన వాతావరణం ఉన్నది. గత ఐదేళ్లగా ప్రకృతి ప్రేమికులు వనభోజనాలకు క్యూ కడుతున్నారు. తాజాగా ప్రకృతి ప్రేమికులకు కృష్ణాపురం పైనరీ అందుబాటులోకి వచ్చింది.

తాజంగి జలాశయం..

ఆంరఽధకశ్మీర్‌ లంబసింగికి ఏడు కిలోమీటర్ల దూరంలో తాజంగి జలాశయం ఉంది. ఇక్కడ ఉన్న విశాలమైన మైదానంలోనే వనభోజనాలకు అనుకూలం. ప్రజల ఆటవిడుపు కోసం జిప్‌లైన్‌, అర్చరీ క్రీడలతోపాటు జలాశయంలో బోటింగ్‌ చేసే అవకాశం ఉంది. చింతపల్లి-నర్సీపట్నం ప్రధాన రహదారికి లంబసింగి జంక్షన్‌ నుంచి వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల్లో జలాశయానికి వెళ్లవచ్చు. ఆర్టీసీ బస్సు సదుపాయం లేదు.

కృష్ణాపురం పైనరీ

పాడేరు-చింతపల్లి మార్గంలో లోతుగెడ్డ జంక్షన్‌కి కిలోమీటర దూరంలో కృష్ణాపురం పైనరీ ఉన్నది. పర్యాటకులకు కోసం మూడు సెమీ పర్మినెంట్‌ కాటేజీలు, సింగి, డబుల్‌ టెంట్లు, వాష్‌ రూమ్స్‌, పిల్లల పార్కు అందుబాటులో ఉన్నాయి. వనభోజనాలు చేసేందుకు ఓపెన్‌ ఉడ్‌ డైనింగ్‌ టేబుల్స్‌ ఉన్నాయి. ఆటవిడుపు కోసం ఆర్చరీ, ఊయలలు ఉన్నాయి. ఇక్కడ వనభోజనాలు చేసేందుకు సందర్శకులు ముందుగా ఓపెన్‌ గ్రౌండ్‌ని నామమాత్రపు ధర చెల్లించి బుక్‌ చేసుకోవాలి. సందర్శకులు 9014060702, 9441107646 నంబర్లకు కాల్‌ చేయవచ్చు.

యర్రవరం జలపాతం

యర్రవరం జలపాతానికి కార్తీక మాసంలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. జలపాతం వద్ద 150 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం జాలువారుతోంది. జలపాతం దిగువన చాపరాయి కూడా వుంది. జలపాతానికి వచ్చిన పర్యాటకులు చాపరాయిలోగాని, చుట్టూనున్న చెట్ల నీడన గాని వనభోజనాలు చేసే అవకాశముంది. పర్యాటకులు మంచినీళ్ల సీసాలను వారి వెంట తీసుకు వెళ్లాలి. యర్రవరం జలపాతాలకు వెళ్లేందుకు వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల్లో మాత్రమే చేరుకోవచ్చు.

Updated Date - Nov 15 , 2026 | 11:47 PM