లంబసింగి గజగజ
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:47 PM
ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిలో చలి పర్యాటకులు, ఆదివాసీలను గజగజ వణికిస్తున్నది.
3 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రత
ఐదేళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రత
చింతపల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిలో చలి పర్యాటకులు, ఆదివాసీలను గజగజ వణికిస్తున్నది. రెండు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రత మూడు డిగ్రీల కంటే తక్కువ నమోదవుతున్నది. ఐదేళ్ల తర్వాత మళ్లీ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గిరిజనులు చలికి అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో లంబసింగికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి 3100 అడుగుల ఎత్తులో కొండల మధ్యలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ వాతావరణం ఉత్తర భారతదేశాన్ని పోలి ఉంటుంది. లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలను కొలిచేందుకు వాతావరణ కేంద్రం అందుబాటులో లేదు. దీంతో లంబసింగి వాతావరణాన్ని పరిశీలించేందుకు 2008-2009 ప్రాంతంలో నాటి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహపరిశోధన సంచాలకులు టి. రత్నసుధాకర్ పర్యవేక్షణలో అధ్యయనం చేశారు. అప్పట్లో శాస్త్రవేత్తల పరిశీలనలో చింతపల్లి కంటే 1.5 నుంచి రెండు డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు లంబసింగిలో నమోదవుతున్నాయని నిర్థారించారు. నాటి నుంచి చింతపల్లిలో నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా లంబసింగిలో 1.5 నుంచి 2డిగ్రీలు తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2012 వరకు ప్రతి ఏడాది లంబసింగిలో ఒకటి, రెండు, సున్న, మైనస్ డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్థానికులు గృహాలు, కాఫీ తోటల్లో థర్మామీటర్లను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఈ ఉష్ణోగ్రతలు పరిగణనలోకి తీసుకోవడం లేదు.
ఐదేళ్ల తర్వాత మళ్లీ అత్యల్పం
లంబసింగిలో ఐదేళ్ల తర్వాత అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో చింతపల్లి, లంబసింగిలో ప్రతి ఏడాది ఒకటీ, రెండు రోజులు మూడు కంటే తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం సహజంగా ఉండేది. కొంత కాలంగా వాతావరణంలో కలిగిన మార్పులతో ఈ స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. శనివారం చింతపల్లిలో 4.8, ఆదివారం 3.9 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ లెక్కన శనివారం లంబసింగిలో 3.3, ఆదివారం 2.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైవుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో లంబసింగిలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనూ స్థానిక ప్రజలు చలి మంట పెట్టుకోవాల్సి వస్తున్నది. 24గంటలు ప్రజలు ఉన్నిదుస్తుల్లోనే కనిపిస్తున్నారు. అర్థరాత్రి చెట్ల కింద వర్షపు చినుకులు మాదిరిగా మంచు చిటపట శబ్దం చేస్తూ పడుతుంది. లంబసింగి విభిన్న వాతావరణానికి స్థానిక గిరిజనులు అవస్థలు పడుతుంటే పర్యాటకులు వినోదం పొందుతున్నారు.