Share News

పొదుపు మహిళలకు లక్ష్మీ కటాక్షం

ABN , Publish Date - Mar 08 , 2026 | 02:03 AM

పొదుపు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది.

పొదుపు మహిళలకు  లక్ష్మీ కటాక్షం

తీపికబురు అందించనున్న ప్రభుత్వం

ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి, కల్యాణ లక్ష్మి పథకాలకు నేడు శ్రీకారం

పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు

కోటవురట్ల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి):

పొదుపు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. సంఘసభ్యుల్లోని పిల్లల చదువు, వివాహాల కోసం ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్‌ కల్యాణ లక్ష్మి పేరిటా రెండు కొత్త పథకాలకు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టనుంది. అర్హులందరికీ ఈ పథకాలను అందించేందుకు ఇప్పటికే సెర్ప్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గత ఏడాది అక్టోబరులోనే ఈ రెండు పథకాలను అమలుచేయాలని నిర్ణయించినా, అమల్లో లోపాలకు ఆస్కారం లేకుండా అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో జాప్యం జరిగింది.

ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి

పాఠశాలలు కళాశాలల్లో పిల్లల ఫీజుకు అవసరమయ్యే మొత్తాన్ని రుణంగా తీసుకునే వీలుంటుంది. ఇద్దరి పిల్లల చదువుకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణ సా యం అందుతుంది. దీనికి కేవలం పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్‌ లెటరు, ఫీజు చెల్లింపు విధానం, ఇనిస్టిట్యూట్‌ వివరాలు, రశీదులు సమర్పించాలి. రుణం మంజూరైన వెంటనే నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమవుతుంది.

ఎన్టీఆర్‌ కల్యాణ లక్ష్మి

మహిళా సంఘంలోని సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. పావలా వడ్డీకే రుణం అందిస్తారు. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. వివాహ లగ్న పత్రిక, శుఖకార్యం నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా పత్రం సమర్పించాలి. పరిశీలన అనంతరం, నేరుగా సభ్యురాలి బ్యాంకుఖాతాకు నగదు జమ చేస్తారు.

సమాఖ్యలకే వడ్డీ మొత్తం

విద్యాలక్ష్మి, కల్యాణ లక్ష్మి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా నిధులు కేటాయిస్తుంది. ఈ పథకాల అమ ల్లో భాగంగా పావలా వడ్డీ కింద సమకూరే ఆదాయంలో 50 శాతం తిరిగి డ్వాక్రా సంఘాలకు అనుగుణంగా ఉన్న మండల గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగిస్తారు. మిగిలిన 50 శాతం స్ట్రీనిధి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలకు వినియోగిస్తారు. ఈ పథకం కింద రుణసాయం పొందిన తర్వాత లబ్ధిదారులు ఏదైనా ప్రమాదంలో మృతిచెందితే రుణం మొత్తం మాఫీ చేస్తారు.

అర్హులు వీరే

డ్వాక్రా సంఘంలో నమోదై, కనీసం నాలుగునెలలు అంతకంటే ఎక్కువకాలం కొనసాగుతున్న సభ్యులకు పథకాలు వర్తింపచేస్తారు. ఇప్పటికే బ్యాంకు లింకేజి, స్ర్తీనిధి, ఉన్నతి తదితర రుణాలు పొందిన వారికి కూడా ఈ పథకాలు అందుతాయి. కొత్త పథకాలు పిల్లల చదువులు, వివాహాలకు అక్కరకు వస్తాయని పొదువు మహిళలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 02:03 AM