రూ.90 కోట్లతో లక్ష్మీదేవిపేట ఫ్లైఓవర్ పనులు
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:55 AM
ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన లక్ష్మీదేవిపేట ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనులను రైల్వేశాఖ ఆధ్వర్యంలో రూ.90 కోట్లతో చేపట్టనున్నట్టు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. దీనికి సంబంధించి పది రోజుల్లో టెండర్ల కూడా పిలవనున్నట్టు ఆయన చెప్పారు.
- పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ
- ఎంపీ సీఎం రమేశ్
అనకాపల్లి టౌన్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన లక్ష్మీదేవిపేట ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనులను రైల్వేశాఖ ఆధ్వర్యంలో రూ.90 కోట్లతో చేపట్టనున్నట్టు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. దీనికి సంబంధించి పది రోజుల్లో టెండర్ల కూడా పిలవనున్నట్టు ఆయన చెప్పారు. శనివారం వంతెన నిర్మాణం జరిగే లక్ష్మీదేవిపేట, రైల్వేగేటు, భీమునిగుమ్మం జంక్షన్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో రైల్వే పరంగా పనులు చాలా వరకు జరిగాయని, అయితే వంతెన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి పనులను కూడా రైల్వేశాఖ పరంగా పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం అధికారులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించామన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభం కావాల్సి ఉందని, అయితే రైల్వే జోన్ హైదరాబాద్ నుంచి విశాఖకు రావడం వలన ఆలస్యమైందన్నారు. పనులు పునఃప్రారంభమైన 18 నెలల్లో పూర్తవుతాయన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు 20 ఏళ్ల క్రితం వంతెనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో శంకుస్థాపన చేయించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపీ సీఎం రమేశ్ రైల్వేస్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ కావడంతో వంతెనకు మోక్షం లభించిందన్నారు. వంతెన నిర్మాణంలో భాగంగా ఐదు దేవాలయాలు, ఒక చర్చిలోని కొంతభాగం, ఒక ఇంటిలోని కొంతభాగం పోతుందన్నారు. ఆలయాలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే భీమునిగుమ్మం జంక్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో నాలుగు ఆర్‌వోబీలు నిర్మాణం కానున్నాయన్నారు. ఇప్పటికే రాజుపాలెం, నర్సింగబిల్లి ప్రాంతాల్లో ఆర్‌వోబీ పనులు ప్రారంభమయ్యాయన్నారు. కశింకోట వద్ద కూడా ఆర్‌వోబీ నిర్మాణానికి సర్వే పూర్తి చేయించామన్నారు. కశింకోట మండలం ఏఎస్‌పేట వద్ద కూడా ఆర్‌వోబీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రూ.27 కోట్లతో అనకాపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, టీడీపీ నాయకుడు దాడి రత్నాకర్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.