Share News

అన్నదాతకు దక్కని మద్దతు

ABN , Publish Date - May 15 , 2026 | 12:59 AM

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పంటల మద్దతు ధరల్లో వరికి పెంచింది స్వల్పమేనని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు.

అన్నదాతకు దక్కని మద్దతు
దుక్కిదున్నుతున్న రైతు

కేంద్ర ప్రభుత్వం వరిపై క్వింటాల్‌కు రూ.72 ప్రకటించిన మద్దతు ధర

గత ఏడాదితో పోలిస్తే కేవలం రూ.3లే పెరిగిందని రైతుల పెదవి విరుపు

- సాగు ఖర్చులకు, ఆదాయానికి భారీగా వ్యత్యాసం ఉంటోందని ఆవేదన

చోడవరం, మే 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పంటల మద్దతు ధరల్లో వరికి పెంచింది స్వల్పమేనని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. వరి పంటకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌పై గత ఏడాది రూ.69 కాగా, ఈ ఏడాది పెంపు కేవలం రూ.72 మాత్రమేనని అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగింది మూడు రూపాయలు మాత్రమేనని రైతులు చెబుతున్నారు. ఇది ఏమాత్రం ఊరటనిచ్చేదిగా లేదని అంటున్నారు.

గత కొన్నేళ్లుగా వ్యవసాయ ఉత్పత్తులకు, కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలకు, పంట సాగుకు అవుతున్న వ్యయానికి వ్యత్యాసం భారీగా ఉంటున్నది. ప్రత్యేకించి వరికి ప్రకటిస్తున్న మద్దతు ధర ఏమాత్రం ఊరట ఇచ్చేదిగా ఉండడం లేదన్న అసంతృప్తి అన్నదాతల్లో ఉంది. దీనికి తోడు కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధర కూడా వంద రూపాయలకు మించి ఉండకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఎరువుల కొరత, భారీగా పెరిగిన ఎరువులు, పురుగుల మందుల ధరలు, కూలీల రేట్లు, యంత్రాల అద్దెలు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి. వరి సాగు పెట్టుబడి భారీగా పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర మాత్రం నామమాత్రంగానే ఉండడంపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న పెట్టుబడి

గతంతో పోలిస్తే వరి సాగు పెట్టుబడి అంతకంతకు పెరిగిపోతోంది. వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు గత ఏడాది వరి కోతలకు డబ్బులు అధికంగా వెచ్చించాల్సి వచ్చింది. యూరియా మినహా డీఏపీ, ఇతర ఎరువుల కాంప్లెక్స్‌ ధరలు, పురుగు మందుల ధరలు ఏటా పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా గ్రామాల్లో కూలి రేట్లు మహిళలకు రూ.400, పురుషులకు రూ.700గా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి ఈ ధరలు ఒక్కో ప్రాంతంలో ఇంకా ఎక్కువగానే ఉంటున్నాయి. సాగులో ఉపయోగించే వ్యవసాయ యంత్రాల అద్దెలు కూడా చాలా కాలం క్రితం నుంచే డిమాండ్‌ను బట్టి దుక్కికి గంటకు రూ.1,000 నుంచి రూ.1,200, దమ్ముకి రూ.1,200 నుంచి రూ.1,500 అవుతోంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్రాల వినియోగం, కూలీల ఖర్చులతో కలుపుకుని పెట్టుబడి రూ.40 వేలు నుంచి రూ.42 వేలు వరకు అవుతోంది. ఇదే సమయంలో దిగుబడి 18 నుంచి 20 క్వింటాళ్లలోపే ఉండడంతో అన్నదాతకు వరిసాగు గుదిబండగా మారింది. సాగుకు అవుతున్న ఖర్చుకు, వచ్చిన ఆదాయానికి పొంతన లేకపోవడంతో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల వైపు మారడమో, లేదంటే వలస కూలీలుగా వెళ్లపోవడమో చేస్తున్నారు.

వరికి మద్దతు ధర క్వింటాల్‌లో ఇలా..

సంవత్సరం కామన్‌ రకం(రూ.లలో) ఏ గ్రేడ్‌ (రూ.లలో)

2020- 21 1,868 1,888

2021- 22 1,940 1,960

2022- 23 2,040 2,060

2023- 24 2,183 2,203

2024- 25 2,300 2,320

2025- 26 2,369 2,389

2026- 27 2,441 2,461

Updated Date - May 15 , 2026 | 12:59 AM