నూతన భవన నిర్మాణాలకు సహకారం కరువు
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:26 PM
మండలంలోని ప్రాఽథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌ల) భవనాలు చాలా వరకు శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
శిథిలావస్థలో నాలుగు పీఏసీఎస్ భవనాలు
తొమ్మిదేళ్లుగా పరాయి పంచన
అద్దె రూపంలో నెలకు రూ.వేలల్లో చెల్లింపు
ఒక్కో సంఘంలో ఏటా రూ.కోట్లలో టర్నోవర్
అయినా సొంత గూటి కోసం చర్యలు శూన్యం
సిబ్బంది, రైతులకు తప్పని అవస్థలు
మాడుగుల రూరల్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రాఽథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌ల) భవనాలు చాలా వరకు శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. దీంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతున్నా పరాయి పంచన కొనసాగాల్సిన దుస్థితి నెలకొంది.
మాడుగులలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో 10 ప్రాఽథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. మాడుగుల మండలానికి సంబంధించి ఎనిమిది పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటిలో మాడుగుల, కేజేపురం, ఎం.కోడూరు, ఎం.కె.వల్లాపురం, వీరవిల్లి అగ్రహారం, వీరనారాయణం, వమ్మలి, కింతలి ఉన్నాయి. అలాగే బుచ్చయ్యపేట మండలంలో వడ్డాది, బంగారుమెట్ట పీఏసీఎస్‌లతో కలిపి మొత్తం పది ఉన్నాయి. మాడుగుల మండలానికి సంబంధించి ఎనిమిది పీఏసీఎస్‌ల్లో మాడుగుల, ఎం.కె.వల్లాపురం, వీరనారాయణం, వీరవిల్లి అగ్రహారంలోని భవనాలు బాగానే ఉన్నాయి. అయితే మిగిలిన ఎం.కోడూరు, వమ్మలి, కింతలి, కేజేపురం భవనాలు పూర్తిగా శిఽథిలావస్థకు చేరుకున్నాయి. 2014లోనే ఇవి శిథిలావస్థకు చేరుకున్నా 2017 వరకు సిబ్బంది అందులోనే విధులు నిర్వహించారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో ఆ తరువాత అద్దె భవనాల్లోకి మారారు. కేజేపురం, వమ్మలి శిథిల భవనాలను అలాగే వదిలేశారు. ఎం.కోడూరు, కింతలి భవనాలను కూల్చివేశారు. వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
అద్దె భవనాలకు వేలాది రూపాయలు చెల్లింపు
ఆయా పీఏసీఎస్‌ల్లో రైతులకు రుణాల రూపంలో ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతోంది. ఒక్కో సంఘం సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైబడి ఏటా టర్నోవర్ చేస్తోంది. ఒక్కో సంఘంలో సుమారు వెయ్యి మంది సభ్య రైతులు ఉన్నారు. అద్దె భవనాలకు నెలకు రూ.వేలల్లో చెల్లింపులు జరపాల్సి వస్తోంది. పైగా అద్దె భవనాల్లో స్థల సమస్య, సౌకర్యాల లేమితో సిబ్బంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆ నాలుగు పీఏసీఎస్‌లకు నూతన భవనాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.