Share News

పరిశ్రమల్లో కొరవడిన భద్రత

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:46 AM

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అనగానే కార్మికులకు హెల్మెట్లు, బూట్లు ఇస్తున్నామని యాజమాన్యాలు చెబుతుంటాయి.

పరిశ్రమల్లో కొరవడిన భద్రత

అదేమంటే...హెల్మెట్‌, బూట్లు ఇస్తున్నామంటున్న యాజమాన్యాలు

అనువైన వాతావరణం కల్పించడంలో విఫలం

నిర్వహణ పనుల విషయంలో నిర్లక్ష్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అనగానే కార్మికులకు హెల్మెట్లు, బూట్లు ఇస్తున్నామని యాజమాన్యాలు చెబుతుంటాయి. ఫార్మా కంపెనీలు అయితే ముక్కుకు వాసన రాకుండా మాస్క్‌లు కూడా ఇస్తున్నామని అంటున్నాయి. భద్రత అంటే ఇదేనా?...అనే అనుమానం కలుగుతోంది. ఇవి సాధారణ ప్రమాణాలు. కార్మికులు పనిచేయడానికి అనువైన వాతావరణం కల్పించడం, పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమైన పరికరాలన్నీ సమకూర్చడం, నిబంధనల ప్రకారం నిర్వహణ చేయించడం, అవసరమైతే మరమ్మతులు చేయడం, ఇంకా తప్పనిసరి అయితే విడి భాగాలు మార్పించడం వంటివన్నీ భద్రతా ప్రమాణాల కిందికే వస్తాయి. స్టీల్‌ ప్లాంటులో పనిచేసే వాతావరణం సరిగ్గా లేదని కార్మిక, ఉద్యోగ సంఘాలు గత రెండేళ్లుగా ఘోషిస్తున్నాయి. కన్వేయర్‌ బెల్ట్‌ల నిర్వహణ గాలికి వదిలేశారు. దాంతో అవి మొరాయిస్తున్నాయి. ఒక్కోసారి రాపిడికి తెగిపోతున్నాయి. వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల సంక్షేమం కోరుకునే సంస్థలు అటువంటివన్నీ సరిచేయాలి. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల వీటిని పక్కన పెడతున్నారు. దాంతో ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది.

అనుభవం లేనివారికి విధులు

స్టీల్‌ ప్లాంటులో ఇటీవల ఒక విభాగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని వేరే విభాగాలకు బదిలీ చేసి అక్కడ పనిచేయమంటున్నారు. అక్కడ అన్నీ యంత్ర పరికరాలపై పని. ఉద్యోగులు సంబంధిత అంశాలపైనే శిక్షణ తీసుకొని, పనిచేస్తారు. వారిని వేరే విభాగంలో పనిచేయమంటే నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. నైపుణ్యం ఉండదు. ఇలాంటివన్నీ ప్లాంటుకు నష్టాలే. అవగాహన లేక తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఇలాంటి ప్రయోగాలన్నీ యాజమాన్యం చేస్తోంది. వీటిపై కూడా త్రిసభ్య కమిటీ దృష్టి పెట్టాల్సి ఉంది.

స్వతంత్ర విచారణ జరపాలి

మానవ హక్కుల వేదిక

స్టీల్‌ ప్లాంటులో జరుగుతున్న ప్రమాదాలకు వ్యక్తిగత తప్పిదాలు కారణం కాదని, కేంద్ర ప్రభుత్వం విధానాలని, ఖర్చు తగ్గింపు ప్రభావం అని మానవ హక్కుల వేదిక ఆరోపించింది. ప్రమాదానికి సరైన కారణాలు తెలియాలంటే స్వతంత్ర కమిటీతో విచారణ చేయించి, నివేదిక ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేసింది. ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయాలని. పనిభారం తగ్గించాలని సూచించింది.


నేడు మాజీ సీఎం జగన్‌ రాక

విశాఖపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి):

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నగరానికి రానున్నారు. స్టీల్‌ప్లాంటు ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలతోపాటు ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 12:46 AM