ప్రత్యేక తరగతులకు స్పందన కరువు
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:06 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు విద్యార్థుల నుంచి స్పందన కరువైంది.
నామమాత్రంగా హాజరవుతున్న ఇంటర్ విద్యార్థులు
విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దేందుకు
ఉన్నత విద్యా మండలి తరగతుల నిర్వహణ
అవగాహన లేక హాజరుకాని విద్యార్థులు
తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్న అధ్యాపకులు
చింతపల్లి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు విద్యార్థుల నుంచి స్పందన కరువైంది. విద్యాబోధన ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరుకాలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచడంతోపాటు విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తొమ్మిది నుంచి పదో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు ఇప్పటికే విద్యాశాఖ బ్రిడ్జి కోర్సును ప్రవేశపెట్టింది. తాజాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులకు సైతం ఉన్నత విద్యామండలి ప్రత్యేక తరగతులను ప్రారంభించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నత విద్యామండలి అధికారులతో సమీక్షించి ఇంటర్ విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం సిలబస్‌తోపాటు నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం జూనియర్ కళాశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులకు ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే గిరిజన ప్రాంతంలో అవగాహన లోపం వల్ల విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరుకావడంలేదు. తక్కువ మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. చింతపల్లి గురుకుల కళాశాలలో 150 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 50 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 412 మంది విద్యార్థులకు 62 మంది, తాజంగి కస్తూర్బాగాంధి పాఠశాలలో 40మందికి 25 మంది మాత్రమే తరగతులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, గురుకులం, కస్తూర్బాగాంధీ పాఠశాలలకు వసతి సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరుకావడానికి ఆసక్తి చూపడంలేదు. విద్యార్థులను పంపించాలని కళాశాల అధ్యాపకులు తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఈమేరకు సోమవారం నుంచి కళాశాలల్లో విద్యార్థులకు సంఖ్య పెరుగవచ్చునని అధ్యాపకులు చెబుతున్నారు.