ఘాట్‌కు కొరవడిన రక్షణ
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:30 AM
పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ఘాట్ మార్గంలోని రక్షణ గోడలు మరమ్మతులకు నోచుకోలేదు. గిరిజన ప్రాంతంలో రాకపోకలకు ఎంతో ప్రధానమైన ఘాట్ రోడ్డును మరింతగా అభివృద్ధి చేసి, ప్రమాదాలను నివారించడంతోపాటు పర్యాటకుల్ని ఆకర్షించేలా తీర్చిదిద్దాల్సి ఉండగా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో నిత్యం ఘాట్‌లో ఏదో ప్రాంతంలో వాహనాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. రక్షణ గోడలు పటిష్టంగా లేకపోవడంతో భయం భయంగా రాకపోకలు సాగించాల్సి వస్తుందని డ్రైవర్లు అంటున్నారు.
కార్యాచరణకు నోచుకోని ప్రతిపాదనలు
చాలా ఏళ్లుగా ఇదే దుస్థితి
ప్రమాదభరితంగా మారిన ఘాట్ ప్రయాణం
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ఘాట్ మార్గంలోని రక్షణ గోడలు మరమ్మతులకు నోచుకోలేదు. గిరిజన ప్రాంతంలో రాకపోకలకు ఎంతో ప్రధానమైన ఘాట్ రోడ్డును మరింతగా అభివృద్ధి చేసి, ప్రమాదాలను నివారించడంతోపాటు పర్యాటకుల్ని ఆకర్షించేలా తీర్చిదిద్దాల్సి ఉండగా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీంతో నిత్యం ఘాట్‌లో ఏదో ప్రాంతంలో వాహనాలు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. రక్షణ గోడలు పటిష్టంగా లేకపోవడంతో భయం భయంగా రాకపోకలు సాగించాల్సి వస్తుందని డ్రైవర్లు అంటున్నారు.
మొక్కుబడిగా రక్షణ గోడల మరమ్మతులు
స్థానిక ఘాట్ మార్గంలోని రక్షణ గోడలు చాలా కాలంగా కనీసం మరమ్మతులకు నోచుకోని దుస్థితి కొనసాగుతున్నది. అయితే 2023 ఆగస్టు 20న ఘాట్‌లోని ఆర్‌టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రమాణికులు మృతి చెందగా.. 31 మంది గాయపడిన ఘటన నేపథ్యంలో అప్పటి కలెక్టర్ సుమిత్‌కుమార్ రక్షణ గోడల మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. దీంతో ఘాట్‌లోని అన్ని మలుపుల వద్ద ఉన్న రక్షణ గోడలకు మరమ్మతులు జరుగుతాయని భావించినప్పటికీ, అందుకు భిన్నంగా రెండు, మూడు మలుపుల్లో మాత్రమే చేసి చేతులు దులుపుకొన్నారు. చివరకు చేసిన ఆ పనులు సైతం నాణ్యత లేకపోవడంతో ప్రస్తుతం అవన్నీ శిథిలమైపోయాయి. ఇదిలా ఉండగా ఇన్నాళ్లు డివిజన్ కేంద్రంగా ఉన్న పాడేరు ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో ఘాట్ మార్గంలో రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో స్థానిక ఘాట్ రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి అవసరం ఉంది. కాని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పాడేరు నుంచి చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగించాలన్నా, ఆయా ప్రాంతాల నుంచి పాడేరుతోపాటు ఒడిశా రాష్ట్రానికి వెళ్లాలన్నా ఘాట్ ప్రయాణం తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఘాట్ మార్గంలో రక్షణపై పాలకులు దృష్టి సారించకపోవడం ఘోరమని ప్రయాణికులు అంటున్నారు. ముఖ్యంగా ఘాట్‌లోని వ్యూపాయింట్‌కు సమీపంలో, రాజాపురం సమీపంలో, ఏసుప్రభు బొమ్మ మలుపునకు అటూ..ఇటూ.. వంట్లమామిడి నుంచి గరికిబంద వరకు ఉన్న మలుపుల్లో రక్షణ గోడలు ఘోరంగా శిథిలమైపోయాయి. పొరపాటున ఏదైనా వాహనాలు అదుపు తప్పితే లోయలోకి దూసుకుపోవాల్సిందే. గతంలో నిర్మించి రక్షణ గోడలు శిథిలం కాగా, చాలా ఏళ్లుగా కొత్తగా రక్షణ గోడలు నిర్మించకపోవడంతో ఘాట్ ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
కార్యాచరణకు నోచుకోని గత ప్రతిపాదనలు
స్థానిక ఘాట్ మార్గంలో ప్రమాదకరంగా ఉన్న మలుపుల వద్ద ఐరన్ గడ్డర్లను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రోడ్ల, భవనాల శాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. ఇదే విషయమై 2022లో అప్పటి ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ సైతం ఘాట్ మార్గంలో అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని రోడ్ల, భవనాల శాఖ ఉన్నతాధికారులను కోరారు. అందుకుగానూ రూ.8.5 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఆయా నిధులు మంజూరైతే ఘాట్‌లోని ప్రమాదకరంగా ఉన్న మలుపులను సరిచేయడంతోపాటు, వాహనాలు అదుపు తప్పి లోయల్లోకి బోల్తా కొట్టకుండా పటిష్టమైన ఐరన్ గడ్డర్లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇదే తరహాలో రోడ్ల, భవనాల శాఖాధికారులు సైతం పలుమార్లు ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ ఏవీ నేటికీ కార్యాచరణకు నోచుకోలేదు. అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన ఘాట్ మార్గంలోని రక్షణ గోడలకు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, డ్రైవర్లు కోరుతున్నారు.